Disha Effect : స్పందించిన రెవెన్యూ అధికారులు

by Kalyani |
Disha Effect : స్పందించిన రెవెన్యూ అధికారులు
X

దిశ, శంషాబాద్ : ప్రభుత్వ భూమిలో రూ. 100 కోట్ల విలువచేసే 5 ఎకరాల 16 గుంటల భూమిని కబ్జా రాయుడు కబ్జా చేశారని శుక్రవారం దిశ పత్రికలో శంషాబాద్ లో భారీ భూ కుంభకోణం అనే కథనం రావడంతో అధికారులు స్పందించారు. రెవెన్యూ అధికారులు శంషాబాద్ తహసిల్దార్ రవీందర్ దత్ ఆదేశాలతో శంషాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, రెవెన్యూ సిబ్బందితో కబ్జా జరిగిన ప్రాంతానికి వెళ్లి సర్వే నెంబర్ 626 లో ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కబ్జాకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశవ నాయుడు పై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కబ్జా జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేశవ నాయుడు పై బిఎస్ఎస్ చట్టం ప్రకారం 329(3),324(4),BNS 3,4, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ పై కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా శంషాబాద్ తహసిల్దార్ రవీందర్ దత్ మాట్లాడుతూ… ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలు తప్పవు అన్నారు. శంషాబాద్ రెవెన్యూ పరిధిలో 626 ప్రభుత్వ భూమిలో 5 ఎకరాల 16 గుంటల భూమిని కబ్జా చేశారని దిశ పత్రికలో రావడంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా కబ్జా చేసిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రధాన వ్యక్తి కేశవ నాయుడు అని తేలింది అన్నారు. అతనితో పాటు భీమ్రావు, అనంతయ్య లపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశామన్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో బోర్డు ఏర్పాటు చేశామని, అక్కడ ఎలాంటి పనులు నడపకుండా పనులు నిలిపివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. 626 సర్వే నెంబర్లో కబ్జా చేసిన భూమిని పూర్తిగా సర్వే చేయించి హద్దురాలు ఏర్పాటు చేసి బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. మరోసారి అక్కడ పనులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కబ్జా చేసి భూమిని సర్వే చేయొద్దని తహసీల్దార్ పై నాయకులు ఒత్తిడి

శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 626 ప్రభుత్వ భూమిలో కబ్జాలు జరిగాయని తహసీల్దార్ కేసులు నమోదు చేయడంతో కబ్జా చేసిన వారికి మద్దతుగా కొంతమంది నాయకులు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి అది పట్టా భూమి కాదు అని తమ వద్ద కోర్టు ఆర్డర్లు ఉన్నాయని బుఖారించారు.దీంతో తహసీల్దార్ భూమి సర్వే చేస్తామని చెప్పడంతో, గతంలోనే సర్వే చేశారని మరోసారి సర్వే ఎలా చేస్తారన్నారు. సర్వే చేయకుండా కొంతమంది నాయకులతో తహసీల్దార్ పై ఒత్తిడి తెస్తున్నారు.

ప్రభుత్వ భూమి కబ్జా పై ఇంటెలిజెన్స్ ఆరా

శంషాబాద్ రాళ్లగుడ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న సర్వే నెంబర్ 626 లో 100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని దిశ పత్రికలో రావడంతో దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేశారు ఎంత కబ్జా చేశారనే విషయాలను రెవెన్యూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed