మంచినీటి సరఫరాలో అధికారుల అలసత్వం .. బీజేఎంసీ దాహం తీరేదెలా..?

by Aamani |
మంచినీటి సరఫరాలో అధికారుల అలసత్వం .. బీజేఎంసీ దాహం తీరేదెలా..?
X

దిశ‌, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మంచినీటి సరఫరా సరిగా లేక నిత్యం అవస్థలు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు పోతున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లు అవసరమైనప్పుడే అటుగా వస్తున్నారు తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. మంచినీరు లేక ప్రజలు వేసవి, చలి, వర్షాకాలాల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంవత్సరం పొడవునా నీటి సమస్య ప్రజల‌ను వెంటాడుతుంది. అయినా అధికారులు మాత్రం తమకేం పట్టిందిలే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రోజు విడిచి రోజు రావాల్సిన నీరు సరిగా రాకపోవడంతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. 15 రోజులకు ఒకసారి కూడా నీరు రాని దుస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

కార్పొరేషన్ పరిధిలో గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో సర్పంచులు ఏదో రకంగా నీరు వచ్చే విధంగా చూసేవారని స్థానికులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుత మున్సిపాలిటీలలో నీరు మాత్రం ఎవరికీ అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. డబ్బులు ఉన్నవారు వాటర్ వాటర్ ప్లాంట్ నుంచి నీటిని తెప్పించుకుంటే సామాన్యులు మాత్రం బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్న కార్పొరేషన్ జలమడలి అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పక్కనే జంట జలాశయాలు ఉన్నప్పటికీ నీటిని మాత్రం సరఫరా చేయడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు రాకపోతే తాము ఎలా జీవనం సాగించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు నీటిని తెచ్చుకోవాలంటే ఎన్ని అవస్థలు పడాలో చెప్పాలంటూ స్థానికులు అధికారులపై మండి పడుతున్నారు.

మౌనం వీడని అధికారులు...

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్య విలయతాండవం చేస్తుంది. రోజు విడిచి రోజు నీరు రాదు సరి కదా వారానికి ఒకసారి కూడా కష్టమే. 15 రోజులకు ఒకసారి నీరును సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా పక్షం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తే తాము ఎలా జీవనం సాగించాలంటూ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలలో నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలుపుతూ గెలిచాక మొహం చాటిస్తున్నారని అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా కార్పొరేషన్ పై దృష్టి కేంద్రీకరించి నీటి సరఫరాకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed