ఈ నెల 21న జిల్లాకు బీసీ కమిషన్ రాక

by Kalyani |
ఈ నెల 21న జిల్లాకు బీసీ కమిషన్ రాక
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 21న రంగారెడ్డి జిల్లాకు విచ్చేయనుందని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 21న రంగారెడ్డి లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీసీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు. అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించ వచ్చని సూచించారు. వారి అభ్యర్థనలతో పాటు నిర్దేశిత నమూనాలో వెరిఫికేషన్ అఫిడవిట్ ఆరు సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ కు నివేదించ వచ్చని కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed