HeartBeat: ఆగిన గుండె.. 90 నిమిషాల తర్వాత మళ్లీ స్పందన

by Mahesh Kanagandla |   ( Updated:2024-11-19 15:13:19.0  )
HeartBeat: ఆగిన గుండె.. 90 నిమిషాల తర్వాత మళ్లీ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా(Odisha) వైద్య చరిత్రలో అరుదైన ఘటన జరిగింది. దాదాపు 90 నిమిషాలపాటు ఆగిన గుండెను భువనేశ్వర్ ఎయిమ్స్(Bhubaneshwar AIIMS) వైద్యులు తిరిగి కొట్టుకునేలా చేశారు. కార్డియక్ అరెస్ట్‌(Cardiac Arrest)కు గురైన పేషెంట్‌కు ఈసీపీఆర్(ఎక్స్‌ట్రాకార్పొరియల్ కార్డియో-పల్మనరీ రిససిటేషన్/eCPR) చేపట్టారు. ఎక్స్‌ట్రాకార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజన్(ఎక్మో/ECMO) ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ఆ తర్వాత సుమారు గంటన్నరపాటు ఆగిన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది.

హార్ట్ ఫెయిల్యూర్‌తో క్రిటికల్ కండీషన్‌లో ఉన్న ఆర్మీ జవాన్‌ను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. హాస్పిటల్ వచ్చిన కాసేపటికే పేషెంట్ కార్డియక్ అరెస్ట్‌కు గురయ్యాడు. సుమారు 40 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా పేషెంట్‌లో కదలిక రాలేదు. ఏం చేయాలా? అనేదానిపై చర్చించి చివరికి ఈసీపీఆర్ ప్రయోగం చేపట్టడానికి నిర్ణయించుకున్నారు. ఇంటెన్సివిస్ట్, అడల్ట్ ఎక్మో స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ బెహరా సారథ్యంలోని బృందం ఎక్మో చికిత్స ప్రారంభించింది. ట్రీట్‌మెంట్ ప్రారంభించిన 90 నిమిషాల తర్వాత గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలైంది. కానీ, లయబద్ధంగా లేదు. తర్వాతి 30 గంటల్లో గుండె రిథమ్ అనూహ్యంగా మెరుగుపడింది. 96 గంటల తర్వాత పేషెంట్ నుంచి ఎక్మోను తొలగించినట్టు ఈసీపీఆర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. గుండె, ఊపిరితిత్తుల పని తీరు సరిగాలేనివారికి ఎక్మో ప్రయోగిస్తే.. అది ఉమ్మడిగా, వేర్వేరుగా వీటి విధులను నిర్వర్తిస్తుంది. ఇది సవాళ్లతో కూడుకున్నదే కానీ, గుండె ఆగిన అత్యవసర పరిస్థితుల్లో మంచి ఫలితాన్ని అందించగలదని నిపుణులు వివరించారు.



Advertisement

Next Story