దారుణం.. అనుమానస్పద స్థితిలో 12 మేకలు, 36 పందెం కోళ్లు మృతి

by Aamani |
దారుణం.. అనుమానస్పద స్థితిలో 12 మేకలు, 36 పందెం కోళ్లు మృతి
X

దిశ, బడంగ్ పేట్​ : నోరులేని మూగ జీవాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మీర్​పేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.5.50లక్షలు విలువచేసే 12 మేకలు, 36 పందెం కోళ్లను హతమార్చారంటూ బాధితులు మీర్​పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్​ పేట్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లెనిన్​నగర్​ ప్రశాంతి నగర్​ కాలనీకి చెందిన వల్లెపు వెంకటేష్​ తన సోదరుడు వల్లెపు నరసింహ తో కలిసి 10 నెలల క్రితం బడంగ్​ పేట్ సాయి​ చైతన్యకాలనీలో ప్లాట్​ నెంబర్​ 91,92 లో గల ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. అందులో మేకల తో పాటు పందెం కోళ్లను పెంచుతున్నారు. స్థలం చుట్టూ కాంపౌండ్​ వాల్​ లోపల మేకల తో పాటు పందెం కోళ్లను వదిలి గేటుకు తాళం వేశారు.

ఉదయం వేళల్లో అతని తల్లి కాపలాగా ఉండగా, రాత్రి వేళల్లో మాత్రం ఇద్దరు సోదరులలో ఎవరో ఒకరు పడుకునేవారు. అయితే ఈ నెల 23వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో బంధువు వచ్చాడని గేటుకు తాళం వేసి సదరు వ్యక్తితో కలిసి లెనిన్​నగర్​కు వెళ్ళారు. మరునాడు ఉదయం 6.30గంటలకు సోదరులు వచ్చి చూడగా మేకలతో పాటు పందెం కోళ్లు రక్తసిక్త గాయాలతో చనిపోవడాన్ని గమనించాడు. కుక్కల దాడిలో చనిపోయి ఉండవచ్చని మొదటి భావించినప్పటికీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా కత్తి గాట్లు ఉన్నాయని బాధితులు మీర్​పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల దాడిలోనే 12 మేకలు, 36 పందెం కోళ్లు చనిపోయాయని, మరో రెండు మేకలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.

ఒక్కొక్క పందెం కోడి విలువ రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుందని, రూ.5.50లక్షల వరకు తమకు నష్టం వాటిల్లిందని బాధితులు మీడియాకు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్​పేట్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మీర్​పేట్​ పోలీసులు పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ఇవి కుక్కగాట్లలాగానే కనిపిస్తున్నాయని ప్రాథమిక విచారణలో అనుమానం వ్యక్తం చేసినట్లు మీర్​పేట్​ పోలీసులు తెలిపారు. ఈ కేసును మీర్​ పేట్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed