రాత్రి వేళల్లో దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

by Kalyani |
రాత్రి వేళల్లో దేవాలయాలలో  చోరీలకు  పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
X

దిశ,మీర్ పేట్ : చెడు వ్యసనాలకు అలవాటై అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాత్రి వేళల్లో దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు తో కలిసి మీర్ పేట్ క్రైమ్ సంయుక్తంగా అరెస్ట్ చేసి అతని వద్ద మూడు పంచలోహ విగ్రహాల తో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్ గూడ లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉండే వడ్ల శ్రీను (39) ఓ హోటల్ లో ఉద్యోగం చేస్తూ తనకు వచ్చే డబ్బు సరిపోకపోవడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలనే ఆలోచనతో ఈ నెల 16 న పోలీస్ స్టేషన్ పరిధిలోని బి ఎన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తులు పూజలు పూర్తిచేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అక్కడికి చేరుకున్న నిందితుడు దేవాలయంలో ఉన్న పంచలోహ విగ్రహాలను చోరీ చేశాడు. దేవాలయంలో నిద్రించిన సిబ్బంది ఉదయం లేచి చూసేసరికి విగ్రహాలు కనిపించకపోవడంతో దేవాలయ చైర్మన్ కు సమాచారం అందించారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన మీర్ పేట్ క్రైమ్ సిబ్బందితో పాటు ఎల్బీనగర్ క్రైమ్ వారితో కలిసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితున్ని ఒక్కరోజులోనే గుర్తించి అతని వద్ద నుంచి మూడు పంచలోహ విగ్రహాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన మీర్ పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు తో పాటు క్రైమ్ సిబ్బందిని,రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఎల్బీ నగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి లు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed