‘ఇప్పుడు తీరిక దొరికిందా..?’ CM రేవంత్‌పై రాకేష్ రెడ్డి ఫైర్

by Satheesh |
‘ఇప్పుడు తీరిక దొరికిందా..?’ CM రేవంత్‌పై రాకేష్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరునెలల తరువాత జిలాల్లో అధికారికంగా తిరగడానికి ముఖ్యమంత్రికి తీరింది అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీపై దాడులు, ఢిల్లీ టూర్లు.. కేసులు నమోదు.. పీఆర్ స్టంట్లు చేయించడం ఇవ్వన్నీ పూర్తి చేసుకుని పర్యటనకు వెళ్తున్నారన్నారు. ఉద్యమాల గడ్డ ఓరుగల్లు పర్యటన మొదట ఎంచుకోవడం మంచిదే కానీ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభించడానికి వెళ్లడం విడ్డురంగా ఉందన్నారు. ఓరుగల్లు పర్యటన సందర్భంగా సీఎంకు మా 5 డిమాండ్లు అన్నారు.

ఎంజీఎంను సందర్శించాలి, కేసీఆర్ శంకుస్థాపన చేసిన మల్టిస్పెషాలిటీ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలి, ఎయిమ్స్ ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తీర్చాలి, కాకతీయ తోరణం ఉంచుతారా లేదా..? సీఎం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. గొప్ప చరిత్ర ఉన్న ఎంజీఎం సందర్శించాల్సింది పోయి కార్పొరేట్ ఆస్పత్రి సీఎం తన చేతులతో ఓపెన్ చేయబోతున్నారన్నారు. రాష్ట్రంలో దయనీయంగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో తక్కువ మంది వైద్యులతో రోగుల భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్‌ల కోసం ప్రైవేట్ సంస్థలపై ఆధారపడాల్సి వస్తుందని ఆరోపించారు.

ఎంజీఎం ఆస్పత్రిలో సరిపడ బెడ్లు లేవు, పారమెడికల్ విధానం లేదు, ఒక్కో బెడ్‌లో ఇద్దరు ముగ్గురు రోగులు ఉంటున్నారన్నారు. చాలి చాలని వసతుల మధ్య చికిత్స చేస్తున్న డాక్టర్లకు మొక్కాలని, ఎంజీఎం ఆస్పత్రిలో కరెంట్ 5 గంటల పాటు లేకపోవడంతో రోగులు విలవిల్లాడారన్నారు. కాంగ్రెస్ పాలన అటకెక్కిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లుగా ఉందని, స్వతంత్ర దేశంలో ఉచిత వైద్యం కోసం ఇంకా మీడియా ముందు మాట్లాడం దురదుష్టకరం అన్నారు. ఆరోగ్యశ్రీలో ఏ వ్యాధికి వర్తిస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అది తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనికిమాలిన పథకాల మీద కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదికాకుండా పేద వాడి ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని కోరారు.

Next Story

Most Viewed