నాలుగేండ్లుగా ఎక్కడి పనులు అక్కడే..- కంపు వాసనతో వికారాబాద్ పట్టణ ప్రజల అవస్థలు

by Anjali |
నాలుగేండ్లుగా ఎక్కడి పనులు అక్కడే..- కంపు వాసనతో వికారాబాద్ పట్టణ ప్రజల అవస్థలు
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : చెత్త డంప్ యార్డు అనగానే వామ్మో ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు.. పొరపాటున వెళితే భరించని దుర్వాసనతో పాటు లేనిపోని జబ్బులు వస్తాయని అందరూ భయపడతారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఎలా..? అంటూ గత కేసీఆర్ ప్రభుత్వం నూతన హంగులతో లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో చెత్త డంప్ యార్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక్క మిషన్ విలువ కోటి రూపాయల పైమాటే. వీటి ద్వారా వాయు కాలుష్య నివారణే కాకుండా ఈ మిషన్లు 19 రకాలుగా చెత్తను వేరు చేస్తాయి. దీంతో మున్సిపల్ కార్మికులకు పని తగ్గుతుంది. ముఖ్యంగా చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలి. ఇలా చేయడంతో మున్సిపాలిటీలకు అదనపు ఆదాయం కూడా వస్తుంది. అందులో భాగంగా డంప్ యార్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2021లో రూ.3 కోట్ల 82 లక్షల నిధులు మంజూరు చేసింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం రైలు పట్టాలు దాటాక గోధుమగూడ, జైదుపల్లి గ్రామాలకు వెళ్లే దారిలో ప్రభుత్వ స్థలంలో 10 ఎకరాల స్థలంలో నూతన డంప్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

నాలుగేండ్లుగా ఎక్కడి పనులు అక్కడే..!

10 ఎకరాల ఈ చెత్త డంప్ యార్డులో ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి మూడు షెడ్లు నిర్మించాల్సి ఉంది. తడి చెత్తకు, పొడి చెత్తకు వేర్వేరుగా షెడ్లు నిర్మించాలి. తడి, పొడి చెత్తను వేరు చేసే యంత్రం ఏర్పాటు కోసం మరో షెడ్ కట్టాలి. ప్రతి షెడ్డు 20 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడువుతో ఉండాలి. చుట్టూ మొక్కలు నాటడం, సిబ్బంది కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, వాచ్‌మన్ ఉండడానికి గదులు, సీసీ రోడ్లు, చుట్టూ ప్రహరీ నిర్మించాలి. కానీ వికారాబాద్ డంప్ యార్డులో మాత్రం ఇప్పటి వరకు కేవలం చుట్టూ ప్రహరీ పనులు మాత్రమే పూర్తయ్యాయి. అందులోనూ నాసిరకం పనులు చేపట్టడంతో ఇప్పటికే అనేక చోట్ల గోడ పడిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో పాటు కొద్దిదూరం సీసీ రోడ్డు వేసి అక్కడక్కడ కొన్ని మొక్కలు నాటారు. కానీ, వాటి పర్యవేక్షణ బాధ్యత ఎవరు తీసుకోవడం లేదు. డంప్ యార్డు నిర్మాణం కోసం ఇప్పటి వరకు టీయూఎఫ్ఐడీఎస్ నుంచి రూ.1.50 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.2.32 కోట్లు విడుదలయ్యాయి.

నిర్మాణ పనులు ప్రారంభం అవ్వగానే స్టీల్‌తో పాటు ఇతర ముడిసరుకుల రేట్లు పెరిగాయని, ఇంత తక్కువ బడ్జెట్‌లో డంప్ యార్డు నిర్మాణం చేయలేనని కాంట్రాక్టర్ వెనకడుగు వేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వ పెద్దలు, అప్పటి ఎమ్మెల్యే ఎవరూ ఈ డంప్ యార్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే బాధ్యత తీసుకోలేదు. 34 వార్డులున్న వికారాబాద్ పట్టణంలో 68,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 30 టన్నుల చెత్త పేరుకుపోతున్నది. గుట్టలుగా అవుతున్న చెత్తను ఏం చేయాలో తెలియక మున్సిపల్ సిబ్బంది చెత్త దిబ్బలకు నిప్పు పెడుతున్నారు. ఈ కారణంగా భారీ ఎత్తున పొగ వెలువడుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా వర్షాకాలం కావడం ఈగలు, దోమలు ఎక్కువ అవడంతో చాలామంది ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాయకులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం కొత్త ప్రభుత్వం, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయినా నూతన డంప్ యార్డు పనులు పూర్తి చేసి తమ కష్టాలు తీరుస్తాడని పట్టణ ప్రజలు వేచి చూస్తున్నారు.

మా కష్టాలు తీరేది ఎప్పుడు..?

గతంలో అనంతగిరి గుట్టకు వెళ్లే దారిలో రాజీవ్ నగర్ కాలనీకి అత్యంత దగ్గరగా పాత డంప్ యార్డు ఉండేది. అక్కడి నుంచి అధునాతన టెక్నాలజీతో కొత్త డంప్ యార్డు ప్రారంభం అవుతుందనగానే మా కాలనీవాసులు సమస్యలు తీరుతాయని, డంప్ యార్డు ద్వారా వచ్చే దుర్వాసన, మురుగు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి బయటపడతామని ఎంతో ఆనందపడ్డారు. కానీ మా బాధలు తీరకపోగా గతంలో కంటే ఎక్కువ దుర్వాసన వస్తుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వ పెద్దలైనా ముందుకు వచ్చి డంప్ యార్డు పనులు త్వరగా పూర్తి చేయాలని రాజీవ్ నగర్ వాసి ఎల్ అనులేఖ్ కోరారు.

కొత్త ప్రభుత్వం పట్టించుకోవాలి

గత ప్రభుత్వం కేవలం హడావిడి చేసింది తప్ప సమస్యకు పరిస్కారం చూపలేదు. కనీసం కొత్త ప్రభుత్వం అయినా డంప్ యార్డు నిర్మాణం పూర్తి చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటుతున్నా వికారాబాద్ డంప్ యార్డ్ ప్రస్తావన ఎక్కడా ఎత్తడం లేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా మా కష్టాలు తీరడం లేదు. ఇప్పుడైనా ఈ సమస్యకు పరిస్కారం చూపాలి.

- టీ ఆనంద్ కుమార్, రాజీవ్ నగర్ వాసి

పనులు ఆలస్యమవడం వాస్తవం

నూతన డంప్ యార్డు పనులు ఆలస్యం అవడం వాస్తవం. కాంట్రాక్టర్ పనులు చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో నిలిచిపోయాయి. ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మళ్లీ టెండర్ వేయాలి. ఈ సమస్య స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టిలో కూడా ఉంది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి డంప్ యార్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తాం.

- జాకీర్ అహ్మద్, కమిషనర్

Next Story

Most Viewed