6న బల్దియా కౌన్సిల్ సమావేశం.. 4న స్డాండింగ్ కమిటీ భేటీ

by Shiva Kumar |
6న బల్దియా కౌన్సిల్ సమావేశం.. 4న స్డాండింగ్ కమిటీ భేటీ
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ నగరానికి ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీ పాలక మండలి (కౌన్సిల్) ఈనెల 6న సమావేశం కానున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పౌర సేవల నిర్వహణ, అభివృద్దితో పాటు పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఈనెల 4న సమావేశం కానున్నట్లు తెలిసింది. మార్చి నెలలో ఏర్పడిన స్టాండింగ్ కమిటీ ఒకసారి సమావేశమైన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కోడ్ రావటంతో తిరిగి సమావేశమయ్యే వీలు కలగలేదు. ఈనెల 4న 15మంది సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశమై పలు అభివృద్ది పనులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించనున్నట్లు సమాచారం. ఆ తరువాత 6న నిర్వహించనున్న కౌన్సిల్‌కు మొత్తం 150 మంది కార్పొరేటర్ల నుంచి 148 ప్రశ్నలు వచ్చినట్లు, అందులో కౌన్సిల్ సమావేశంలో చర్చకు, అధికారుల నుంచి సమాధానం కోసం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దాదాపు 25 ప్రశ్నలను ఎంపిక చేసినట్లు తెలిసింది.

చర్చించనున్న అంశాలు ఇలా..

ఈనెల 6న జరగనున్న జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా శానిటేషన్, కుక్కులు, దోమల బెడద, సీజనల్ వ్యాధులు, జీహెచ్ఎంసీ అప్పులు, ఆర్థిక సంక్షోభంతో పాటు ట్యాక్స్ కలెక్షన్, టౌన్ ప్లానింగ్ వంటి అంశాలపై రసవత్తరమైన చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మహా నగరానికి చెందిన పలు ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో అధికారులను నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కొందరు బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే దోమలు, కుక్కల బెడద వంటి సమస్యలపై అధికారులను నిలదీయాలన్న అలోచనతో మేయర్ కు అదే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సమర్పించినట్లు సమాచారం. తమ ప్రశ్నలు కౌన్సిల్ లో ప్రస్తావించకుంటే నిరసన వ్యక్తం చేయాలని కూడా కొందరు కార్పొరేటర్లు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జీహెచ్ఎంసీ అప్పులు, ఆదాయ వనరులపై బీజేపీ కార్పొరేటర్లు అధికారులను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు సైతం వర్షాకాలం సహాయ చర్యలు, నాలాల విస్తరణ, పూడికతీత పనులతో పాటు పలు ప్రజాసమస్యలపై అధికారులను ప్రశ్నించే అవకాశమున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed