వ్యవసాయ పొలంలో రొయ్యల పెంపకం

by Naresh N |
వ్యవసాయ పొలంలో రొయ్యల పెంపకం
X

దిశ, నాగార్జునసాగర్: వ్యవసాయమే పరమావధిగా పంటల సాగు చేసే రైతులకు కష్ట నష్టాలే ఎక్కువ. లాభదాయక పంటలు వేసిన లాభాలు దరి చేరని పరిస్థితి. ఈ నేపథ్యంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ,అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూరకు సమీపంలో గాలి సైది రెడ్డి తన పొలంలో సేద్యం చేయకుండా రొయ్యల పెంపకంలో ఆదర్శంగా నిలిచాడు. భూమి ఉంటే వర్షాధార పంటలతో సాగు చేసే రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్నంగా ప్రత్యామ్నాయ ఆలోచనలతో రొయ్యల సాగులో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. తన సొంత వ్యవసాయ భూమిలో ఐదున్నర ఎకరాల్లో రొయ్యల సాగుకు అనుకూలంగా చెరువులు తవ్వించి సుమారు 13 లక్షల రొయ్య పిల్లలను ఆంధ్ర నుంచి తెప్పించి పెంపకం చేపట్టారు. వాస్తవంగా రొయ్యలు ఉప్పు నీటిలోనే ఎదుగుతాయని తెలిసినప్పటికీ సేంద్రియ పద్ధతిలో పెంపకం చేపట్టారు. వీటికి కావలసిన దానా కూడా బీఎస్‌ఎఫ్ లార్వాతో పాటు సొంతంగా ప్రోటీన్స్ అందేటట్టు తగు చర్యలు తీసుకుంటూ పప్పు దినుసులు సమాన నిష్పత్తిలో పిండి పట్టించి వాటిని ఉడకబెట్టి దానాగా అందిస్తున్నారు.

రొయ్య పిల్లలు ఒక్కొక్కటి 35 పైసలకి కొనుగోలు చేసి వాటిని చెరువులో వేసి పెంపకం మొదలుపెట్టారు. వీటిని 24 గంటలు పర్యవేక్షించడానికి అక్కడే ఉంటూ ఎంతో శ్రమిస్తున్నారు. తనతోపాటు నలుగురు శ్రామికులకు కూడా ఉపాధి కల్పించగలుగుతున్నానని ఆయన తెలిపారు. అయితే ఆయన మాటల్లోనే విందాం. రూ. 15 లక్షల ఖర్చుతో అను క్షణం కంటికి రెప్పల 3 నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుంది. కానీ మార్కెటింగ్‌కి మాత్రం గిట్టు బాటు ధర రావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని గిట్టు బాటు ధర సాగుకు కావలసిన వనరులు ఇప్పించి ఆదుకోవాలని మనవి చేశారు. 24 గంటలు నలుగురు మనుషులు వాటికి మూడు పూటల దానా వేస్తూ అనుక్షణం నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా చూస్తూ అవసరమైనప్పుడు ఆక్సిజన్ మిషన్స్‌ను రన్ చేస్తున్నామని రైతు గాలి సైదిరెడ్డి తెలిపారు.



రొయ్యల పెంపకాన్ని ఇంటి వెనకాల చేపట్టేందుకు ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి చెరువులో మంచి నీటి రొయ్యలను పెంచి అధిక లాభాలను ఆర్జించవచ్చు. రొయ్యల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు, నేల తల్లిని నమ్ముకుని ఏళ్ల తరబడి అన్నదాత సైదిరెడ్డి వ్యవసాయాన్ని వదలలేక, రొయ్యల రంగం వైపు వెళ్లారు.

చెరువుల నాణ్యత:

రొయ్యల పెంపకంలో చెరువుల నాణ్యత చాలా ప్రాధాన్యం ఉంటుంది. చెరువు మురుగునీరు, ఇన్లెట్‌తో ఉండాలి. పెంచుకోవాలనుకున్న రొయ్యలు నాణ్యత ఉండేలా చూసుకోవాలి. రొయ్యలు తినడానికి ఆల్గే, క్రిమి లార్వా అందిస్తుండాలి. కొత్తగా తవ్విన చెరువులతో తొలి సంవత్సరం అధిక ఆదాయం రాదు. అంతమాత్రాన నిరుత్సాహానికి గురవ్వొద్దు. చెరువు నీళ్లు రసాయనాలు, హానికరమైన బ్యాక్టీరియా లేకుండా చూసుకోవాలి. చెరువులో చేపలు, ఇతర ఉభయచరాలు లేకుండా జాగ్రత్త పడాలి. నీటి పీహెచ్ బ్యాలెన్స్ 10 కంటే తక్కువగా ఉండేలా గమనించాలి. నీటిలో రోజంతా నడిచేలా ఎరేటర్ జోడించాలి.



ఈ ఆహార పదార్థాలు ఇవ్వాలి:

రోజుకు రెండుసార్లు రొయ్యలకు తిండి వేయాలి. 38 శాతం ప్రోటీన్ కలిగిన గుళికలు, ఆల్గే, క్రిమి లార్వా, పాచిని రొయ్యలు తింటాయి. ఆహారం ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగా రొయ్యలు వృద్ధిచెందుతాయి. చెరువు నీటిని ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.

Advertisement

Next Story

Most Viewed