Swiggy: ఏడాదిలో 25 లక్షల మ్యాగీలు ఆర్డర్ చేసిన హైదరాబాద్ వాసులు

by S Gopi |
Swiggy: ఏడాదిలో 25 లక్షల మ్యాగీలు ఆర్డర్ చేసిన హైదరాబాద్ వాసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో క్విక్-కామర్స్ కంపెనీల కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా గృహావసరాలను తక్కువ సమయంలో తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎక్కువ మంది కస్టమర్లు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ సంస్థ స్విగ్గీ 2024 ఏడాదికి సంబంధించి స్విగ్గీ క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ నివేదికను విడుదల చేసింది. ఇందులో , హైదరాబాద్‌లో సైతం స్విగ్గీకి అత్యధిక ఆర్డర్లు వస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ వాసులు ఎక్కువగా కూరగాయలు, బ్యూటీ ఉత్పత్తులపను కొంటున్నారని నివేదిక తెలిపింది. పని ఒత్తిడితో పాటు ట్రాఫిక్, ఇతర కారణాలతో చాలామంది ఆన్‌లైన్ కొనుగోళ్లకు, ప్రధానంగా క్విక్ డెలివరీ సేవలకు అలవాటు పడుతున్నారు. కస్టమర్లు ఎక్కువగా కూరగాయలతో పాటు చిప్స్, కండోమ్స్, ఐస్‌క్రీమ్, పాలు వంటి ఉత్పత్తులను ఎక్కువసార్లు ఆర్డర్ చేశారు. ఈ ఏడాదిలో హైదరాబాద్ కస్టమర్లు ఏకంగా 25 లక్షల మ్యాగీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. అంతేకాకుండా రూ. 2.3 కోట్ల విలువైన టూత్‌బ్రష్‌ల ఆర్డర్లు రాగా, ఐస్‌క్రీమ్ కోసం హైదరాబాద్ వాసులు రూ. 31 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఇక, అత్యధిక ఆర్డర్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఈ ఏడాది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఓ బెంగళూరు వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షల విలువైన కొనుగోళ్లు నిర్వహించాడు. బెంగళూరులో ఎక్కువ నిత్యావసరాల వస్తువులు, బొమ్మలు, బ్యూటీ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ వంటి వాటిని ఆర్డర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed