రెండు సర్కారు మెడికల్ కాలేజీలకు అనుమతి

by GSrikanth |
రెండు సర్కారు మెడికల్ కాలేజీలకు అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించింది. రానున్న (2023-24) విద్యా సంవత్సరం నుంచే 100 చొప్పున ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి లేఖ అందింది. మరో ఏడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల అనుమతి ప్రక్రియ ప్రాసెస్‌లో ఉన్నదని, వీటికి కూడా త్వరలోనే లభిస్తాయని మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సమర్పించిన అఫిడవిట్, ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో నెలకొల్పనున్న మెడికల్ కళాశాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంఏబీఆర్ నుంచి వచ్చిన సిపారసుల మేరకు పర్మిషన్ ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరఫున మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధ్యక్షుడు ఆ పర్మిషన్ లేఖలో స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తనిఖీల సందర్భంగా కొన్ని లోసుగులు, వెలితి ఉన్నట్లు బోర్డు గుర్తించిందని, వాటిని మూడు నెలల వ్యవధిలో చక్కదిద్దుతామని రాష్ట్ర అధికారులు హామీ ఇచ్చారని బోర్డు అధ్యక్షుడు ఆ లేఖలో ప్రస్తావించారు. నిబంధనల మేరకు ఆ లోపాలను సరిదిద్దాల్సిందేనని, ప్రభుత్వం తరఫున అండర్‌టేకింగ్ ఇచ్చినందున అనుమతి ఇస్తున్నామని, భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఇవన్నీ అందుబాటులో ఉండాలని నొక్కిచెప్పారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చినట్లుగానీ, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లుగానీ తేలితే గుర్తింపును రద్దు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు కూడా ఉంటాయన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కళాశాలలో (ఈ రెండు జిల్లాల కాలేజీల్లో) 100 చొప్పున సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.

కళాశాలల్లో అందుబాటులో ఉన్న స్పెషాలిటీస్, అభ్యసిస్తున్న విద్యార్థులు, బోధిస్తున్న ఫేకల్టీ, అనుబంధ ఆసుపత్రి డీటెయిల్స్.. ఇలాంటివన్నీ వెబ్‌సైట్‌లో పొందుపర్చడంతో పాటు డిస్‌ప్లేలో పిజికల్‌గా ఉండాలని బోర్డు అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, స్పెషాలిటీస్, ఎక్విప్‌మెంట్, ఓపీ (ఔట్ పేషెంట్), ఐపీ (ఇన్‌పేషెంట్) వివరాలు కూడా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed