ఓవర్ టు అడ్మినిస్ట్రేషన్.. ఫోకస్ మొత్తం ఆ కీలక అంశాలపైనే..!

by Rajesh |
ఓవర్ టు అడ్మినిస్ట్రేషన్.. ఫోకస్ మొత్తం ఆ కీలక అంశాలపైనే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. ఎన్నికలు కంప్లీట్ కావడంతో అడ్మినిస్ట్రేషన్ అంశాలపై రివ్యూలు చేయనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. భూమికి సంబంధించిన పలు అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు సచివాలయంలో గురువారం ధరణి కమిటీ సమావేశం కానున్నది. ఆ తర్వాత ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కూడా వివి ధ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇరిగేషన్, విద్యుత్, తాగునీటి సరఫరా, విద్య, గ్యారంటీలతో పాటు హామీల అమలు, విధివిధానాల రూపకల్పన, వీటికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నది.

రాష్ట్రంలో రైతు భరోసా స్కీం అమలు పై త్వరలోనే వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖలతో రివ్యూ జరిగేందుకు కసరత్తు ప్రాథమిక స్థాయిలో మొదలైంది. రైతుబంధు గత ప్రభుత్వంలో అమలైనట్లుగానే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. కానీ సాగులో లేని భూములకు సైతం నిధులను రిలీజ్ చేయడం ద్వారా ప్రజా ధనం వృథా అవుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ మొదలు చాలా మంది మంత్రులు వ్యాఖ్యానించారు. దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబంధు నిబంధనల్లో మార్పులు చేసే అవకాశంపై జోరుగానే చర్చలు జరిగాయి.

రానున్న వర్షాకాలంలో గోదావరి, కృష్ణా జలాలను ప్రణాళికాబద్ధంగా వాడుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగాలుగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతు చేయాల్సిన దృష్ట్యా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసులు, జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశాలతో వర్షాలు కురిసేలోపే మరమ్మతు పనులు కంప్లీట్ కావాల్సి ఉన్నది. ఈసారి వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా నీటిని పక్కా ప్రణాళికతో వాడుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనున్నది.

తాగునీటి ఇబ్బందులపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఈ వారంలోనే తొలి విడతగా 2.5 టీఎంసీలు వస్తాయని మంత్రి ఉత్తమ్ ఇటీవల తెలిపారు. ఇక విద్యాసంవత్సరం కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కాను న్న నేపథ్యంలో ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు ప్రభుత్వం రివ్యూ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నది. గత ప్రభుత్వంలో అమలైన స్కీంలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై సంబంధిత అధికారులతో మాట్లాడి విధాన నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

వీటన్నింటికీ అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించుకోవడం కూడా పెద్ద టాస్క్ గా మారింది. మార్చి నెలలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు నాలుగు నెలల కాలానికే ఆమోదం లభించినందున పూర్తిస్థాయి బడ్జెట్‌పైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సి ఉన్నది. ఒకవైపు రైతుభరోసా, మరోవైపు పంద్రాగస్టుకల్లా రెండు లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తామని సీఎం హామీ ఇచ్చినందున నిధులను కూడా రెడీ చేసుకోవాల్సి ఉన్నది. ఏక కాలంలో ఫుల్ బడ్జెట్ రూపకల్పన, స్కీంలకు నిధుల కేటాయింపు ప్రభుత్వానికి అనివార్యమవుతున్నది. లోక్‌సభకు ఇంకా మూడు ఫేజ్‌ల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున స్టార్ క్యాంపెయిన ర్‌గా ఉత్తరాది రాష్ట్రాల్లో సీఎం రేవంత్ పాల్గొంటూనే పరిపాలనాపైనా దృష్టి సారించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed