ఓరుగ‌ల్లు కాషాయమయం.. నిరుద్యోగ మార్చ్‌‌తో హై టెన్షన్

by Sathputhe Rajesh |
ఓరుగ‌ల్లు కాషాయమయం.. నిరుద్యోగ మార్చ్‌‌తో హై టెన్షన్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : పోరుగ‌డ్డ ఓరుగ‌ల్లు నుంచే నిరుద్యోగ మార్చ్ రూపంలో నిర‌స‌న‌ల‌కు బీజేపీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శ‌నివారం సాయంత్రం 4గంట‌ల‌కు కాక‌తీయ యూనివ‌ర్సిటీ క్రాస్ రోడ్ నుంచి హ‌న్మకొండ‌లోని అంబేద్కర్ విగ్రహం వ‌ర‌కు మార్చ్ కొన‌సాగ‌నుంది. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ మార్చ్ ర్యాలీలో వేలాది మంది నిరుద్యోగుల‌ను స్వచ్ఛందంగా పాల్గొనేలా వారం రోజుల పాటు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసింది.

ఓయూ, కేయూ జాక్‌లు కూడా మద్దతు తెలిపిన ద‌రిమిలా శ‌నివారం జ‌ర‌గ‌బోయే మార్చ్‌లో 10వేల మందికి మించి నిరుద్యోగులు పాల్గొంటార‌న్న అంచ‌నాలున్నాయి. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటార‌నే ఇంట‌లిజెన్స్ వ‌ర్గాల స‌మాచారంతో వ‌రంగ‌ల్ పోలీసులు సైతం 700 మంది బందోబ‌స్తుకు నియ‌మిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సంఖ్యను మ‌రింత పెంచే అవ‌కాశం ఉన్నట్లుగా కూడా స‌మాచారం అందుతుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్ర అగ్ర నాయ‌క‌త్వంలోని కీల‌క నేత‌లు ఒక్కోక్కరుగా వ‌రంగ‌ల్ చేరుకుంటుండ‌గా, హ‌న్మకొడ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద సంద‌డి నెల‌కొంది.

ప్రధాన కూడ‌ళ్లలో కాషాయం రెప‌రెప‌లు..!

బీజేపీ నిరుద్యోగ మార్చ్‌కు త‌ర‌లివ‌స్తున్న బీజేపీ నాయ‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ స్థానిక జిల్లా నేత‌లు భారీగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ ప‌ట్టణాల్లోని ప్రధాన ర‌హ‌దారుల్లోని కూడ‌ళ్లపై బీజేపీ జెండాల తోర‌ణాలతో కాషాయం రెప‌రెప‌లాడుతోంది. నిరుద్యోగ మార్చ్‌ను వ‌రంగ‌ల్‌లో దిగ్విజ‌యం చేసి, మిగ‌తా జిల్లాల్లో ప్రారంభించాల‌ని, అటు త‌ర్వాత హైద‌రాబాద్ కేంద్రంగా మిలియ‌న్ మార్చ్ నిర్వహణ‌కు బాట‌లు వేయాల‌ని బీజేపీ నేత‌లు యోచిస్తున్నారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్‌పైనా బీఆర్‌ఎస్ నేత‌లు విమ‌ర్శలు చేస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయం వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఎక్కువ‌గా యువ‌త‌, నిరుద్యోగులు పాల్గొంట‌న్న బీజేపీ నిరుద్యోగ మార్చ్‌పై పోలీసులు డేగ నిఘా వేసి ఉంచారు. మొత్తంగా 4గంట‌ల‌కు మొద‌లై 8గంట‌ల వ‌ర‌కు సాగే ఈ ర్యాలీపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

Advertisement

Next Story

Most Viewed