మరో సారి 10 గంటలు విచారణ.. ఆ విషయంలో సోమా భరత్ క్లారిటీ!

by Rajesh |   ( Updated:2023-10-10 15:37:29.0  )
మరో సారి 10 గంటలు విచారణ.. ఆ విషయంలో సోమా భరత్ క్లారిటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉన్న ప్రమేయంపై ఈడీ అధికారులు మంగళవారం పది గంటలకు పైగా ఆమెను విచారించారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకు విచారించి ఇంటికి పంపించివేశారు. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆమెకు వివరించిన అధికారులు.. తేదీని ప్రకటించకుండా మెయిల్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఉగాది పండుగ (బుధవారం) రోజున మాత్రం ఎంక్వయిరీ ఉండదని ఈడీ స్పష్టం చేసినట్టు ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్‌కుమార్ మీడియాకు వివరించారు. గతంలో ఆమె వాడిన మొబైల్ ఫోన్లను తాజా విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు అందజేశారు. తదుపరి విశ్లేషణ కోసం వాటిని ఈడీ అధికారులు ఫోరెన్సిక్ లాబ్‌‌కు పంపనున్నారు.

మూడు సార్లు.. ముప్పై గంటలు

తొలుత ఈ నెల 11న కవితను విచారణకు పిలిచిన ఈడీ.. ఆ రోజు సుమారు 9 గంటల పాటు విచారించింది. సోమవారం (ఈనెల 20న) మరో సారి ఎంక్వయిరీకి హాజరైన ఆమెను సుమారు పది గంటల పాటు అధికారులు విచారించారు. మంగళవారం సైతం పది గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం మూడు రోజుల్లో ఆమెను దాదాపు 30 గంటల పాటు ఎంక్వయిరీ చేసి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు.

కొన్ని స్టేట్‌మెంట్లకు ఆమోదం తెలిపే ముందు తన న్యాయవాదులతో కవిత సంప్రదింపులు జరిపారు. మహిళగా తనను సాయంత్రం ఆరు గంటల తర్వాత విచారించవద్దంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోనూ ఆమె పేర్కొన్నప్పటికీ ఈడీ అధికారులు మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మూడు రోజుల పాటూ రాత్రి 9 గంటల తర్వాత కూడా ఆమెను విచారించారు.

సౌత్ గ్రూపు, కిక్‌బ్యాక్‌లపై ఫోకస్

మద్యం పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూపు తరఫున జరిగిన సంప్రదింపులు, హోటళ్లలో జరిగిన మీటింగులు, ఆర్థిక లావాదేవీలు, లెక్కల్లోకి రాని డబ్బు హవాలా మార్గంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరడం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముందుగానే డబ్బులు చేరవేయాల్సిన అవసరం, ఇండో స్పిరిట్స్ కంపెనీలో షేర్లు దక్కడం.. తదితరాలన్నింటిపైనే ఈడీ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది.

అడ్వాన్సు కిక్‌బ్యాక్ చెల్లింపులపైన ఎక్కువగా ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘన, ఎవరెవరికి ఏ మేరకు ప్రమేయం ఉన్నదో కొన్ని వివరాలను రాబట్టినట్టు సమాచారం. సౌత్ గ్రూపులో కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఇంకా ఈడీ విచారించలేదు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ తర్వాత కవితను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే చాన్స్ ఉన్నది.

లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు ప్రమేయం గురించి కవితను ప్రశ్నిస్తున్న సమయంలోనే ఆమె ఇప్పటికే సమర్పించిన బ్యాంకు స్టేట్‌మెంట్స్, ఆమె డైరెక్టర్‌గా ఉన్న పలు కంపెనీల వార్షిక ఆడిట్ రిపోర్టుల్లోని వివరాలను ఈడీ అధికారులు లేవనెత్తినట్టు తెలిసింది. ఆదాయ వనరులతో పాటు లెక్కల్లోకి రాని డబ్బును సన్నిహితుల ద్వారా తరలించిన అంశాన్ని ఆమె నుంచి రాబట్టే తీరులో ప్రశ్నించినట్టు సమాచారం.

పదేండ్ల ఆమె ఆదాయపు పన్ను రిటన్‌లలో పేర్కొన్న అంశాలతో ఎన్నికల అఫిడవిట్‌లలో పేర్కొన్న ఆదాయం, అప్పుల గురించి కూడా ఈ ఎంక్వయిరీలో ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. పిళ్లయ్‌, బుచ్చిబాబు, అభిషేక్, వెన్నమనేని శ్రీనివాసరావు తదితరుల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని ఆధారాలను ముందుపెట్టి ఆమె సమాధానాన్ని రికార్డు చేశారు.

పాత స్టేట్‌మెంట్లలోని ఆరోపణలపై కూడా

స్కాం వ్యవహారంలో కవితకు బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లయ్ వ్యవహరించారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు.. వారిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధం, లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూపు తరఫున పోషించిన పాత్ర విషయాన్నే ఎక్కువగా ఆరా తీసినట్టు తెలిసింది. పిళ్లయ్ గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలోని అంశాలకు సంబంధించిన ఆధారాలను కవిత ముందు పెట్టి ఆమె నుంచి వివరణ కోరారు.

ఆప్ పార్టీతో కవితకు పొలిటికల్ అండర్‌స్టాండింగ్, డీల్ కుదిరినట్టు పిళ్లయ్ ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌పై లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి తోడు ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించిన బుచ్చిబాబు తన స్టేట్‌మెంట్లలో వెల్లడించిన వివరాలపైనా అధికారులు ఆమెను ప్రశ్నించారు. వీటన్నింటికి కవిత చెప్పిన సమాధానాలను కూడా స్టేట్‌మెంట్ రూపంలో ఈడీ రికార్డు చేసింది.

సెల్‌ఫోన్ల వినియోగం వివరాలపై ఆరా

ఏడాది కాలంలో (2021 సెప్టెంబరు నుంచి 2022 ఆగస్టు వరకు) పది సెల్‌ఫోన్లను మార్చి వాడినట్టు ప్రస్తావించిన ఈడీ అధికారులు ఆమెకు సన్నిహితంగా ఉన్నవారు కూడా సరిగ్గా అదే సమయంలో ఫోన్లు మార్చడానికి దారితీసిన పరిస్థితులపై ఆమె నుంచి వివరణ కోరారు. బుచ్చిబాబు, పిళ్లయ్, అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి తదితరులు ఫోన్‌లు మార్చిన తేదీలను వివరించి వీటన్నింటి మధ్య ఉన్నలింకులపై ఆరా తీశారు.

కవిత సమర్పించిన ఫోన్ల ఐఎంఈఐ, గతంలో చార్జిషీట్లలో ఈడీ అధికారులు పొందుపర్చిన వివరాలతో సరిపోలేదన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఫోరెన్సిక్ లాబ్ నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా వీటి గురించి లోతుగా ప్రశ్నించే చాన్స్ ఉన్నది. డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేసిన వ్యవహారం నేరపూరితమైన చర్యగా భావించి తదుపరి దర్యాప్తుపై సీబీఐ రంగంలోకి దిగే అవకాశమున్నది.

జాయింట్ ఎంక్వయిరీపై సస్పెన్స్

అరుణ్ పిళ్లయ్ కస్టడీని పొడిగించాలంటూ స్పెషల్ కోర్టును విజ్ఞప్తి చేసిన సమయంలో జాయింట్ ఎంక్వయిరీ (కాన్‌ఫ్రంటేషన్) విషయాన్ని ఈడీ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. సిసోడియాను ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ మాజీ అధికారులు అరవింద్, రాహుల్‌సింగ్, మద్యం వ్యాపారులు అమిత్ అరోరా, దినోశ్ అరోరా తదితరులతో కలిసి విచారించనున్నట్టు కోర్టుకు షెడ్యూలును ప్రకటించారు. కవితను సైతం పిళ్లయ్‌తో కలిపి జాయింట్ ఎంక్వయిరీ నిర్వహించాల్సిన అవసరాన్ని పరోక్షంగా నొక్కిచెప్పారు. ఇప్పటివరకు పిళ్లయ్‌తోగానీ, ఇంకెవరితోగానీ తనను జాయింట్‌గా విచారించలేదన్న విషయాన్ని కవిత అనధికారికంగా పేర్కొన్నారు.

దీంతో కవిత, సిసోడియా, ఎంపీ మాగుంట తదితరుల జాయింట్ ఎంక్వయిరీపై ఇంకా ఈడీ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మహిళను సాయంత్రం తర్వాత విచారించరాదని, ఇంటిలోనే ప్రశ్నించాలని, వీడియోలో రికార్డు చేయాలని పిటిషన్‌లో కవిత పేర్కొనడంతో సుప్రీంలో వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. తర్వాత ఈడీ ఎలా వ్యవహరించేదీ స్పష్టత రానున్నది.

మనీ లాండరింగ్ చట్టంలో మహిళల విచారణపై ప్రత్యేక నిబంధనలేవీ లేకపోవడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ ఎలా స్పందిస్తుంది, ఆమె తరఫున ఎలాంటి వాదనలు వస్తాయి, వాటికి ఈడీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది, ఫైనల్‌గా ఎలాంటి ఉత్తర్వులు జారీ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కవితను భవిష్యత్తులో విచారించే సమయంలో అవసరమైన మార్పులపై స్పష్టత రానున్నది.

వ్యక్తిగతంగా హాజరుకావడం లేదా ప్రతినిధులను పంపడంపైనా కవిత నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు కవితన మూడు సార్లు విచారించిన ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి, సౌత్ గ్రూపునకు ఉన్న లింకులు, వాటి వెనక జరిగిన తతంగం లోతును వెలికి తీయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సౌత్ గ్రూపులో పిళ్లయ్, బుచ్చిబాబు, అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తదితరులంతా ఉన్నందున ఇప్పటికే కొద్దిమంది నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఎంపీ మాగుంటను ఇంకా ప్రశ్నించలేదు. ఆయన నుంచి వచ్చే వివరాలకు అనుగుణంగా తదుపరి ఎంక్వయిరీపై ఈడీ ఒక స్పష్టతకు వచ్చే అవకాశమున్నది.

సీబీఐ దర్యాప్తు సైతం ముమ్మరం?

ఒకరి స్టేట్‌మెంట్‌లో వెల్లడైన అంశాలు మరొకరి సమాధానంతో సరిపోకపోవడంతో వాస్తవాన్ని రాబట్టడం ఈడీ అధికారులుకు సవాలుగా మారింది. ఇలాంటి అంశాల కారణంగానే జాయింట్ ఎంక్వయిరీపై దృష్టి పెట్టింది. ఇందుకోసమే కొద్దిమంది కస్టడీని పొడిగించాలంటూ స్పెషల్ కోర్టును రిక్వెస్టు చేసింది. దాదాపు 80% మేర దర్యాప్తు పూర్తయిందని, సౌత్ గ్రూపు ప్రమేయానికి సంబంధించిన కొన్ని వివరాలు వస్తే ఇక కోర్టులో ట్రయల్ ప్రక్రియే ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కవితతో పాటు ఎంపీ మాగుంటను, అవసరమైతే బుచ్చిబాబును కూడా మరికొన్ని సార్లు విచారణకు పిలిచి వివరాలను రాబట్టాలనుకుంటున్నది. మరోవైపు సీబీఐ కూడా ఈ స్కామ్‌లో సౌత్ గ్రూపు కుట్రకోణాన్ని వెలికితీయడానికి దర్యాప్తును ఇకపైన ముమ్మరం చేసే చాన్స్ ఉన్నది.

సుప్రీంలో 24న విచారణ

ఈడీ ఎంక్వయిరీకి సంబంధించి సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ ఈనెల 24న విచారణకు రానున్నది. ఈ కారణంగా అప్పటివరకు ఆమెను విచారించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక మహిళగా తనను సూర్యాస్తమయం తర్వాత విచారించరాదని, ఈడీ ఆఫీసుకు పిలవకుండా ఇంటి దగ్గరే విచారించాలని, వీడియో (ఆడియోతో సహా) రికార్డు చేయాలని ఆ పిటిషన్‌లో ఆమె కోరారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే తీరులో ఈడీ వ్యవహరిస్తున్నందున తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరోవైపు ఈడీ సైతం కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed