ఎయిర్ పోర్టు భూ సేక‌ర‌ణ‌కు లైన్

by Kalyani |
ఎయిర్ పోర్టు భూ సేక‌ర‌ణ‌కు లైన్
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : మామునూరు విమానాశ్ర‌యం నిర్మాణాంశంలో కీల‌క ముంద‌డుగు ప‌డింది. విమ‌నాశ్రయానికి అవ‌స‌ర‌మైన భూమిని సేక‌రించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.205కోట్ల‌ను కేటాయింపు నిధుల‌ను మంజూరు చేసింది. మామునూరు విమానాశ్రాయ నిర్మాణాన్ని స్వ‌యంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించనుంది. A-320 విమానాల సాంకేతికతకు అనుగుణంగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ చేపట్ట‌నున్నారు. వ‌రంగ‌ల్ వాసుల విమానం క‌ల నెర‌వేర్చే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. వ‌రంగ‌ల్ జిల్లా ఖిలా వ‌రంగ‌ల్ మండ‌లంలో నిర్మించ త‌ల‌పెట్టిన‌ మామూనూరు విమానాశ్రయానికి భూసేకరణకు కసరత్తు కొలిక్కి వ‌స్తోంది.తొలి దశలో 253 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులతో గడిచిన కొద్ది నెలలుగా సంప్రదింపులు చేస్తోంది.

తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే నిర్మాణ వ్యవహారాలు మొదలు పెడతామంటూ ఏయిర్‌ పోర్టు అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుత 1.8 కి.మీ రన్‌వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలుగా భూ సేక‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని యిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. ఆపై బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలకు కూడా మామునూరు ఎయిర్పోర్ట్ కు రావడానికి వెసులుబాటు దొరుకుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఏఏఐ సూచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం భూముల సేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి అందించాలని నిర్ణయించింది. విమానాశ్ర‌య నిర్మాణానికి మొత్తం 950 ఎక‌రాలు కావాల‌ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పేర్కొంది.

మామూనూరులో ఇప్ప‌టికే ఎయిర్ పోర్ట్ స్థ‌లం 693 ఎక‌రాలుండ‌గా, మ‌రో 253 ఎక‌రాల‌ను గాడిప‌ల్లి, గుంటూరు ప‌ల్లి గ్రామాల‌ నుంచి 197 ఎక‌రాలు, న‌క్క‌ల‌ప‌ల్లి గ్రామం నుంచి 149.36 ఎక‌రాలు, మామునూరు గ్రామం నుంచి 5 ఎక‌రాల‌ను సేక‌రించ‌నున్నారు. మొత్తం 233 మంది రైతుల నుంచి భూ సేక‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే మూడు గ్రామాల్లో రైతులతో స‌భ‌లు నిర్వ‌హించిన అధికారులు.. వారిని ఒప్పించి భూమిని స్వాధీనం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిపై రైతుల్లో భిన్నాభిప్రాయాలున్న‌ప్ప‌టికి ఎక్కువ మంది రైతులు సానుకూల‌తను వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖ‌రులోగా భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ దాదాపు స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మార్కెట్ రేటుకు అనుగుణంగానే రైతుల‌కు, నిరాశ్రాయుల‌కు ప‌రిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

ఆటంకాలు తొల‌గిన‌ట్లే...

ఈ క్రమంలో, 280.30 ఎకరాల భూమి సేకరణ కోసం రూ. 205 కోట్లను రాష్ట్ర‌ప్ర‌భుత్వం మంజూరు చేసింది. అదనంగా, ర‌న్‌వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని ఉచితంగా ఏఏఐకు అప్పగించేందుకు వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ మామునూరు ఎయిర్ పోర్టు ప్రారంభానికి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ అందించ‌డంతో ఆటంకాలు తొల‌గిన‌ట్ల‌యింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతంలో విమాన రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది

Advertisement

Next Story

Most Viewed