ప్రజల ఆశీర్వాదంతో స్వర్ణయుగం ఆవిష్క‌రిస్తాం : మంత్రి కొండా సురేఖ‌

by Kalyani |
ప్రజల ఆశీర్వాదంతో స్వర్ణయుగం ఆవిష్క‌రిస్తాం : మంత్రి కొండా సురేఖ‌
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటు తన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. వరంగల్ బిడ్డనైన తాను మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టుకు మోక్షం లభించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తున్నదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టువదలకుండా శ్రమించి అనుకున్నది సాధించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు వర్షాకాలంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు పొంచి ఉన్న ముంపును నివారించేందుకు గాను అవసరమైన పనులు చేపట్టే నిమిత్తం రూ. 160.92 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేయడం పట్ల మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు నిమిత్తం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 863 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నదని మంత్రి అన్నారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూ నిర్వాసితుల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే పరిష్కరించి చేతల ప్రభుత్వంగా నిరూపించిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనులకు ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణనను అమలు చేయబోతున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed