- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో రెస్పెక్ట్.. నో రెస్పాన్స్.. సీఎం కార్యాలయంపై గవర్నర్ Tamilisai Soundararajan హాట్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాప్రతినిధులు జనంలో తిరగడంలేదని, వారి సమస్యలను చెప్పుకోడానికి మరో మార్గం లేదని, ఆ కారణంగానే తన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటున్నారని గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని, పరిష్కరించాల్సిందిగా సూచించానని, ఎన్ని లేఖలు రాసినా రెస్పాన్స్ లేదన్నారు. రాజ్‌భవన్ పట్ల గౌరవమూ లేదు, ప్రభుత్వం నుంచి స్పందనా లేదని అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా నియమితులై మూడేండ్లు నిండిన సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా తమిళిసై సౌందర్ రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. పరిపాలనకు రాజకీయాలకు సంబంధం లేదని, రెండు వ్యవస్థలూ స్నేహపూర్వక సంబంధాలతో, మెరుగైన సమన్వయంతో ఉన్నప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు మాత్రమే ఉన్నాయని, ముఖ్యమంత్రి ఫొటో లేదంటూ పాత్రికేయులు ప్రస్తావించగా, ఇక్కడకు రాకపోవడానికి అదే కారణమైతే ఆయన ఫొటోలు పెట్టిస్తామని, అప్పుడైనా వస్తారా అంటూ సెటైర్ వేశారు. గవర్నర్ అధికారిక బంగళాకు ఇప్పటివరకూ రాజ్‌భవన్‌గా మాత్రమే గుర్తింపు ఉండేదని, ప్రజల నుంచి సమస్యలు స్వీకరించడం, వివిధ కార్యక్రమాల్లో తానూ యాక్టివ్‌గా పాల్గొనడం, జనం మధ్యకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడం, ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు, ప్రజా దర్బార్ నిర్వహణ, మహిళల కోసం మహిళా దర్బార్.. ఇలాంటివన్నీ చేస్తున్నానని, చివరకు ఇది ప్రజాభవన్‌గా మారిందన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న విషయం గురించీ, గవర్నర్ స్థాయిలో చొరవ తీసుకోవడం గురించి తమిళిసై స్పందిస్తూ, రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటైందని, చర్చల ద్వారా అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలు ఉన్నదని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా తెలంగాణ తరఫున కేసీఆర్ హాజరు కాలేదని గుర్తుచేశారు. నిజంగా కేంద్రంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోడానికి ఈ సమావేశం ఒక మంచి వేదిక అని, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారంటూ కేసీఆర్ ధోరణిని తప్పుపట్టారు. కేంద్రంలోని అధికార పార్టీతో ఎన్ని రకాలుగా రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలనా అవసరాల కోసం స్నేహపూర్వక సంబంధాలు ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాలకు పరిష్కారమే లక్ష్యంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని, నిమ్స్ డైరెక్టర్‌గా ఉండి కూడా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళారని, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికే తన స్వంత ఆస్పత్రిమీద నమ్మకం లేకపోతే ఇక ప్రజలకు ఎలా ఉంటుందని గవర్నర్ వ్యాఖ్యానించారు. వైద్యారోగ్య అవసరాలకు ప్రజలు ఎక్కడకు పోవాలని ప్రశ్నించారు. విద్య, వైద్య మనకు కనీసమైన అవసరాలని, వాటిని పొందడం ఒక హక్కు కూడా అని గుర్తుచేసిన గవర్నర్, ఇవి భవిష్యత్ తరాలకు మనం పెట్టే పెట్టుబడి అన్నారు. విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అనేక టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అనేక గురుకుల పాఠశాలల్లో ఆహార పదార్ధాల నాణ్యత పడిపోయిందని, ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు అనేక బాధలను తనతో పంచుకున్నారని గుర్తుచేశారు.
ప్రజల నుంచి తనకు వస్తున్న సమస్యల్లో విద్య, వైద్యం, భూములకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయని, వారి స్థాయిలో ఇవి వారికి జీవన్మరణ సమస్యలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో పనిచేసిన గవర్నర్‌తో రాని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకొస్తున్నాయని పాత్రికేయులు ప్రస్తావించగా, మరొకరితో పోలిక పెట్టుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. ఇతరులకు ఉన్న కళలు తనకు తెలియవన్నారు. ప్రోటోకాల్ విషయం గురించి ఎక్కువగా చెప్పడం తనకు ఇష్టం లేదని, కానీ జిల్లాల పర్యటన సందర్భంగా కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులు కూడా రాకపోవడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నానని అన్నారు. నిద్రపోతున్నట్లు నటించేవారిని లేపడం కష్టమనే నానుడిని గుర్తుచేశారు. దీని గురించే ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోదల్చుకోలేదని అన్నారు. దాని చుట్టే ఆలోచనలు తిరిగితే తాను ప్రజల సమస్యలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టలేనని అన్నారు.
రాజ్‌భవన్‌కు గౌరవం ఇచ్చే విషయంలోనూ తెలంగాణలో తేడా ఉన్నదని, వ్యక్తిగా తనను గౌరవించకపోతే బాధపడనని, కానీ గవర్నర్ ఆఫీసుకు, వ్యవస్థకు అవమానం కలిగించడం, ఇగ్నోర్ చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు గవర్నర్ వ్యవస్థను దూరం పెట్టడం కొత్త సంప్రదాయమన్నారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్ వరకూ వచ్చి ప్రజలు సమస్యలను విన్నవించుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన ఉన్నదో అర్థం చేసుకోచ్చన్నారు. ప్రజా ప్రతినిధుల విధుల్లో తాను జోక్యం చేసుకోదల్చుకోలేదని, కానీ వారికి లోకల్‌గా పరిష్కారం కాకపోవడంతోనే ఇక్కడిదాకా వస్తున్నారని అన్నారు.
రాజ్‌భవన్ అంటరాని భవనమా అని ప్రశ్నించిన ఆమె, గతంలో చాలా మంది గవర్నర్లు రాజకీయాల నుంచి వచ్చినవారేనని, అప్పటివరకూ అలాంటివి ఉన్నా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పొలిటీషియన్లుగా ఉండరని అన్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను యాక్సెప్ట్ చేయనందుకే ఈ విభేదాలు ఏర్పడ్డాయా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, దానికి తాను ఓకే చెప్తేనే ప్రోటోకాల్ ఉంటుందా, రాజ్‌భవన్‌కు సీఎం వస్తారా అని ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిన ఫైల్‌లో కౌశిక్ రెడ్డి గురించి సోషల్ సర్వీస్ కేటగిరీ అని ఉన్నదని, దాన్ని పరిశీలించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17 ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, అది విమోచన దినమే అని స్పష్టం చేశారు. గవర్నర్‌గా తన పరిధి, పరిమితులు, విధుల గురించి క్లారిటీ ఉన్నదని, వ్యక్తిగా తనకుగానీ, గవర్నర్‌గా రాజ్‌భవన్‌కుగానీ గౌరవం ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలను కలిసే బాధ్యతను విస్మరించలేనని అన్నారు.