వారికి పోడు పట్టాల్లేవ్.. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన సంఘాలు ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-25 03:15:52.0  )
వారికి పోడు పట్టాల్లేవ్.. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన సంఘాలు ఫైర్
X

ఇప్పటికే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తాం..సర్వే పూర్తయింది. ఇంకా ఎవరన్నా భూమి లేకుండా, ఉపాధి లేకుండా ఉంటే దళితబంధు తరహా గిరిజనబంధు పథకాన్ని ప్రారంభిస్తాం. అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతది. 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఎమ్మె్ల్యేల సమక్షంలోనే పంపిణీ చేస్తాం. - సీఎం కేసీఆర్ - ఈ ఏడాది ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటన

సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ పట్టాలిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే గొత్తికోయలకు మాత్రం మొండిచేయి చూపుతున్నది. వారితో పాటు పోడుభూములు సాగుచేసుకుంటున్న నాన్ ట్రైబల్స్‌కు సైతం ఇవ్వడం లేదని తెలిసింది. అయితే గొత్తికోయలు తెలంగాణకు చెందిన వారు కాదనేది ప్రభుత్వ వాదన. ఛత్తీస్‌గడ్ నుంచి వలసొచ్చి అడవులను నరికి సాగు చేసుకుంటే ఎలా గిరిజనుల కిందకు వస్తారని ప్రశ్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వారిని గిరిజనుల కింద గుర్తించలేదని అందుకే పోడు పట్టాలివ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకూ గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపజేయాలని భావిస్తున్నది. 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గతంలో ప్రకటించారు.

అయితే చెప్పిన దానికి ప్రస్తుతం పంపిణీకి సిద్ధమవుతున్న లెక్కలకు పొంతలేదని తెలుస్తున్నది. కేవలం 4.5 లక్షల ఎకరాలను లక్షా 80 వేల మంది గిరిజనులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. తెప్పించుకున్న లెక్కల ప్రకారం 11.5 లక్షల ఎకరాల భూమి సాగులో ఉన్నదని తేలినప్పటికీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా పంపిణీకి వెనుకడుగు వేస్తున్నది.

గొత్తికోయలకు పోడు పట్టాల్లేవ్

గొత్తికోయలు తెలంగాణకు చెందినవారు కాదనేది ప్రభుత్వ వాదన. వారు చత్తీస్‌గడ్ నుంచి వలసొచ్చి అడవులను నరికి సాగు చేసుకుంటే ఎలా గిరిజనులకిందకు వస్తారని ప్రభుత్వం పేర్కొంటున్నది. అటవీహక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం గొత్తికోయలు కూడా గిరిజనుల కిందికే వస్తారు. అయితే కేంద్రం వారిని గిరిజనుల కింద గుర్తించలేదని అందుకే ఇవ్వడం లేదని ప్రభుత్వం సాకుగా చూపెడుతున్నది.

1,272 గొత్తి కోయల ఆవాసాలు

రాష్ట్ర వ్యాప్తంగా 1,272 గొత్తి కోయల ఆవాసాలున్నాయి. వీరంతా చత్తీస్‌గడ్ నుంచి వలసొచ్చినట్టు అటవీ శాఖ చెబుతున్నది. వీటిలో ఇప్పటికే 329 గ్రామాలు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాయి. ఆయా గ్రామాల పరిధిలో 1,14,892 ఎకరాల్లో పోడు సాగవుతున్నది. దీంతో పాటు మరో 943 ప్రాంతాల్లో గొత్తి కోయలు నివాసం ఉంటున్నట్లు అటవీ శాఖ అంచనా వేసింది. ఆ పరిధిలోని 88,711 ఎకరాలను పోడు సాగుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

అన్ని జిల్లాల ఆవాసాల్లో 1,25,699 మంది కొత్తి కోయలు నివాసముంటున్నట్టు ఫారెస్ట్​శాఖ ప్రభుత్వానికి రిపోర్టు చేసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 304, మహబూబాబాద్‌లో 195, జయశంకర్​భూపాలపల్లిలో 140, నిర్మల్‌లో 111, కొమరంభీం ఆసీఫాబాద్‌లో 83, ఆదిలాబాద్‌లో 179, ఖమ్మంలో 31 ఆవాసాలు ఉన్నాయని గతంలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గొత్తికోయలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.

వారికి ప్రభుత్వం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కు సైతం కల్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంటు ఇలా అన్ని ఎలక్షన్లలోనూ వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయినా వారికి భూ హక్కులు కల్పించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇచ్చిన హామీ మేరకు పట్టాలివ్వాలి : గిరిజన సంఘాల డిమాండ్

ప్రభుత్వ తీరుపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజనులందరికీ, పోడు భూములు సాగుచేసుకుంటున్న వారందరికీ హక్కులు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటమార్చడం తగదని పేర్కొంటున్నాయి. సాగు చేసుకుంటున్న వారందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలివ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో నిరసనలకు సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Next Story