మెంట్రాజ్ పల్లి వాసికి సైబర్ నేరగాడి బెదిరింపు కాల్

by Mahesh |
మెంట్రాజ్ పల్లి వాసికి సైబర్ నేరగాడి బెదిరింపు కాల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నీ కూతురు బెంగళూరులో రెండు కిలోల డ్రగ్స్‌తో పట్టుబడిందని, అర్జెంటుగా రూ. 50 వేలు పంపితే కేసు లేకుండా వదిలిపెడతామని ఓ సైబర్ నేరగాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి బెదిరింపు కాల్ చేశారు. డబ్బులు పంపకపోతే ఈ బిడ్డ పై కేసు నమోదు చేసి ఢిల్లీకి తీసుకెళ్తామని అవతలి వ్యక్తి వాట్సప్ కాల్‌లో బెదిరించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లికి చెందిన పీసరి మోహన్ అనే వ్యక్తికి సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో +923286005238 నెంబర్ నుంచి వాట్సాప్ ఇన్ కమింగ్ కాల్ వచ్చింది. నెంబర్ ఎవరిదనేది చూడకుండా మోహన్ ఫోన్ ఎత్తి మాట్లాడాడు. అవతలి వ్యక్తి తనను సీబీఐ అధికారి రామకృష్ణగా పరిచయం చేసుకొని బెంగళూరు సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్టుగా చెప్పాడు. నీ కూతురు మేఘన రెండు కిలోల మాదకద్రవ్యాల స్టాక్‌తో పట్టుబడిందని, తనను బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నామని చెప్పాడు.

తను నేరం ఒప్పుకుందని, ఆడపిల్ల కావడంతో మానవతా దృక్పథంతో కేసు నమోదు చేయకుండా వదిలేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. ఇందుకోసం అర్జెంటుగా రూ. 50 వేలు ఫోన్ పే, లేదా గూగుల్ పే ద్వారా పంపించాలని బెదిరింపు స్వరం తో మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో అక్కడక్కడ సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి పత్రికల్లో, మీడియాలో వస్తున్న కథనాలపై అవగాహన కలిగి ఉన్న మోహన్ భయపడకుండా ఫోన్‌లోనే గట్టిగా మాట్లాడి బెదిరించాడు. తను కూడా సీబీఐ ఆఫీసులోనే ఉన్నానని, ఒకసారి మా ఆఫీసర్‌కు ఫోన్ ఇస్తాను మాట్లాడుమని చెప్పగానే అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశారు. తిరిగి అదే నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే కనెక్ట్ కావడం లేదని బాధితుడు మోహన్ 'దిశ ప్రతినిధి' కి తెలిపారు.

ఈనెల 2న కూడా ఇదే నెంబర్ నుంచి తనకు పలుమార్లు వాట్సాప్ కాల్ వచ్చినప్పటికీ తను లిఫ్ట్ చేయలేదని మోహన్ తెలిపారు. సోమవారం అనుకోకుండా కాల్ లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తి తనను ఈ రకంగా బెదిరించాడని ఆయన తెలిపారు. తర్వాత తను తన ఇద్దరు పిల్లలు పాప, బాబుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి విషయం కనుక్కున్నానన్నారు. వారు ఉన్నచోట కాలేజీలో బాగానే ఉన్నారని వారితో వాట్సాప్ వీడియో కాల్‌లో కూడా మాట్లాడాక మనసు కుదుటపడిందని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రుల మానసిక బలహీనతను సొమ్ము చేసుకొని డబ్బులు దోచేయడానికి, పిల్లల పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని మోహన్ తల్లిదండ్రులను అభ్యర్థించారు. పోలీసులు కూడా దీనిపై ప్రజల్ని ఇంకా చైతన్య పరిస్తే సైబర్ నేరాలు నియంత్రించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed