న్యాయవాది భిక్షపతి పై సచివాలయ పాలకవర్గం ఫైర్..

by Sumithra |   ( Updated:2023-02-15 11:32:25.0  )
న్యాయవాది భిక్షపతి పై సచివాలయ పాలకవర్గం ఫైర్..
X

దిశ, భిక్కనూరు : న్యాయవాది ముసుగులో పాఠశాల ప్రహరీ గోడని కూల్చి, ఆర్ అండ్ బీ రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టిన మీరు, మా పైనే ఆరోపణలు చేస్తారా..? ఇది న్యాయమేనా అంటూ సీనియర్ న్యాయవాది గజ్జెల భిక్షపతి పై సర్పంచ్ తునికి వేణు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సచివాలయ పాలకవర్గ సభ్యులు, మురికి కాలువల నిర్మాణంపై చేసిన ఆరోపణల పై భిక్కనూరు పట్టణ సర్పంచ్ తునికి వేణు, సచివాలయ పాలకవర్గ సభ్యులతో కలసి సచివాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆర్ అండ్ బి అధికారులను సంప్రదించిన తర్వాతే మురికి కాలువల నిర్మాణం చేపడుతున్నామని, మీరు ఇల్లు కట్టుకునే సమయంలో సచివాలయ అనుమతి తీసుకున్నప్పుడు ఇచ్చిన కొలతల ప్రకారం కాకుండా, ప్రభుత్వ పాఠశాల గోడను కూల్చి, ఆర్ అండ్ బీ స్థలాన్ని ఆక్రమించి, ఇంటి నిర్మాణం చేపట్టి, తమపై అసత్యపు ఆరోపణలు చేయడాన్నివారు తీవ్రంగా ఖండించారు. అంతటితో ఊరుకోకుండా అభివృద్ధినే అడ్డుకుంటావా అంటూ మండిపడ్డారు. పట్టణాభివృద్ధికి సహకరించాల్సింది పోయి, సచివాలయ పాలకవర్గ నిర్ణయాన్నే తప్పుపట్టే విధంగా ఆరోపణలు చేయడం తగదన్నారు. పట్టణంలో అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.

గ్రామసభలు జరిగితే ఒక్క గ్రామ సభకు హాజరై సలహాలు సూచనలు ఇవ్వాల్సిన మీరు, గ్రామసభకు వచ్చి 55 ఫీట్లు కాకుండా కొంత తగ్గిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తే, సలహాలు సూచనలు పాటించేవారమని స్పష్టం చేశారు. అప్పుడు పట్టణప్రజల సమక్షంలో తీర్మానాలు చేసి, పనులు కొనసాగిస్తున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక్కరే కాదని, తాము కూడా ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. మీరు అన్ని కరెక్ట్ గా చేసి తమపై ఆరోపణలు బాగుండేదన్నారు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే అంతకంటే ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టే సత్తా మాకు ఉందని ఇకనైనా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

రోడ్డుకు ఇరువైపులా చాలామంది పర్మిషన్ సమయంలో ఇచ్చిన కొలతలు ప్రకారం కాకుండా, రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపట్టారని వారికి చెప్పిన తరువాతే కూల్చివేతలకు దిగామని, యజమానులే ముందుకొచ్చి స్వచ్ఛందంగా కూల్చుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. న్యాయవాది ముసుగులో పాఠశాల ప్రహరీ గోడను కూల్చి ఇంటిని నిర్మించాడని ఈ విషయమై జిల్లాకలెక్టర్ కు, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఎవరు ఎన్నికుట్రలు చేసినా కాలువ నిర్మాణ పనులను ఆపేప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. భిక్కనూరు పట్టణానికి ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ మరో 60 లక్షల మంజూరు చేశారని ఆయన సహకారంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed