MLA : అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టుచీర నేసిన ఘనత చేనేతలది..

by Sumithra |
MLA : అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టుచీర నేసిన ఘనత చేనేతలది..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నేతపనిలో చేనేత కార్మికుల పనితనం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని, అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టుచీరలు నేసిన ఘన చరిత్ర చేనేత కార్మికులదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు భారత స్వతంత్ర్య ఉద్యమంలో నూలు వడికే రాట్నం ప్రధాన భూమిక పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సముపార్జనలో దేశప్రజల్లో స్వదేశీ చైతన్యాన్ని నింపే ఒక సాధనంగా నిలిచిందన్నారు. గాంధీజీ కూడా రాట్నం పై నూలు ఉడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువుల వాడకంలో కూడా చేనేత కార్మికులు ముఖ్యపాత్ర పోషించారని ఎమ్మెల్యే అన్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువుల వాడకం పై ప్రత్యేక దృష్టిపెట్టి వారిని ప్రోత్సాహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. చేనేత కార్మికుల త్యాగాలను, వారి శ్రమను గుర్తించిన నరేంద్రమోదీ 2015 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించారన్నారు. ఆగస్టు 7 ను జాతీయ చేనేత దినోత్సవంగా కూడా ప్రకటించారని తెలిపారు. 2012 - 14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72 మందికి అవార్డులు ప్రధానం చేశారన్నారు. వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు ప్రదానం చేశారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేతన్నల బతుకులు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో చేనేతలకు పని కల్పిస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా చేనేతలకు చేతినిండా పనికల్పించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు తను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిజామాబాదు అర్బన్ లో ఉన్న చేనేత మహిళా కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, మేక విజయ, జడ్పీటీసీ రెంజల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed