మత్తు.. చిత్తు! గంజాయికి బానిసలవుతోన్న యువత

by Shiva |
మత్తు.. చిత్తు! గంజాయికి బానిసలవుతోన్న యువత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మత్తు కోసం యువత కొత్తగా ఎత్తులేస్తూ చిత్తవుతోంది. సంప్రదాయ మత్తు పదార్థాలు అందుబాటులో లేని వారు ఇతర ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది యువత మత్తు కోసం మద్యం, గంజాయి లాంటి వాటితో పాటు బోనోఫిక్స్‌ లాంటి ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. యువకులు, విద్యార్థులు దీనికి బానిసలుగా మారి వారి జీవితాలను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. గంజాయి అలవాటుతో ఇప్పటికే చాలామంది తమ చదువును మధ్యలోనే వదిలేస్తే, మరికొందరు తాము చేస్తున్న ఉద్యోగాలను నిర్లక్ష్యం చేసి చేజేతుల ఉద్యోగాలు కోల్పోయారు.

దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది తాము చేస్తున్న ఉద్యోగాల నుంచి తీసివేయబడ్డారు. అందులో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పని‌ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సెలవులకు జిల్లాకు రాగా ఇక్కడ సరదాగా స్నేహితులతో అలవాటైన గంజాయి సిగరెట్లు వాడకం వ్యసనంగా మారడంతో వారి జాబ్ ప్రమాదంలో పడింది. ఉద్యోగం పోగొట్టుకుని మరింత కృంగిపోయిన వారు గంజాయి సిగరెట్ మాత్రమే వదలడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే చాలిస్తున్నారు. మత్తుకు అలవాటు పడి అనేక అఘాత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై తల్లితండ్రులు అప్రమత్తమై పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించకపోతే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా వీటి వినియోగంపై నిఘా పెట్టి నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

గతంలో ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలోని సిరికొండ, భీమ్‍గల్, డిచ్‍పల్లి, కమ్మర్ పల్లి, గాంధారి, మాచారెడ్డి, లింగంపేట్, బాన్సువాడ తదితర మండలాల పరిధిలో గతంలో గంజాయి చాలా ఎక్కువగా సాగయ్యేది. అప్పుడు రైతులు, గిరిజనులు, వయసులో పెద్ద వారు మాత్రమే అప్పుడప్పుడు గంజాయిని చుట్ట పొగలాగా తాగేవారు. అప్పుడు ఈ అలవాటుకు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, యువకులు దరిదాపుల్లోకి కూడా రాలేదు. గంజాయి అనే మత్తు పదార్థం ఒకటుంటుందనే విషయం కూడా చాలా మందికి అప్పట్లో అవగాహన ఉండేది కాదు. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్లు అక్రమంగా మహారాష్ట్రకు తరలించే వారు. ఇదంతా తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితి. కానీ, తెలంగాణ ఏర్పాటుతో పరిస్థితి చాలా దారుణంగా మారింది. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్ ప్రభుత్వ హయాంలో గంజాయి వాడకాలు, వ్యాపారాలు జోరుగా పెరిగాయి. ఈ పదేళ్ల కాలంలోనే యువకులు, స్కూల్, కాలేజీ విద్యార్థులు గంజాయికి బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు.

ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల నుంచి రవాణా..

ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన వైజాగ్, పాడేరు, అరకు తదితర ఏరియాల నుంచి నిజామాబాద్ మీదుగా గంజాయిని మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ రవాణాను నియంత్రించేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నేతృత్వంలో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపాలని సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

కల్తీ కల్లు తయారీలో ఆల్ఫ్రా‌జోలం..

పల్లెల్లో తెల్ల కల్లుగా వాడుకలో ఉన్న ఈత కల్లును చాలా‌మంది ఇష్టంగా తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదనే అభిప్రాయం చాలా‌మందిలో ఉంది. అందుకే మహిళలు, పురుషులు కల్లును ఇష్టంగా తాగుతారు. కానీ, ఆ కల్లు వాడకం విపరీతంగా పెరిగిపోవడం, డిమాండ్‌కు తగినట్లుగా చెట్లు లేకపోవడంతో కల్లు తక్కువగా వస్తోంది. దీంతో కృత్రిమంగా కల్లును తయారు చేసేందుకు, మోతాదుకు మించిన మత్తునిచ్చేలా ప్రమాదకరంగా కల్లును తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఆల్ఫ్రాజోలం కలిపిన కల్లును విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అందుకు బానిసైన చాలామందిలో నరాల బలహీనత, వణుకుడు వ్యాధి వంటివి వస్తున్నాయి. రోజూ కల్తీ కల్లును తాగిన వారు పొరపాటున రెండు మూడు రోజులు తాగకపోతే పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తూ వారేం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా‌మంది కల్తీ కల్లు అందక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై నియంత్రణ ఉంచాలని, గంజాయి వాడకం, అక్రమ రవాణా, డ్రగ్స్ వాడకం, కల్తీ కల్లు, అల్ఫ్రాజోలం వంటి వాటిపై కొరడా ఝుళిపించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

Advertisement

Next Story

Most Viewed