విద్యార్థినీలకు నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే

by Kalyani |
విద్యార్థినీలకు నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే
X

దిశ : నాగిరెడ్డిపేట్ : విద్యార్థినీలకు సమయం ప్రకారం నాణ్యమైన భోజనం, అల్పాహారాలను అందించకుంటే పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయినీలతో పాటు భోజన ఏజెన్సీ నిర్వాకులపై చర్యలు తప్పవని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హెచ్చరించారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం రోజు విద్యాలయంలో ఉదయం 11 గంటలు దాటిన అల్పాహారం అందించకపోవడంతో విద్యార్థినీల తల్లిదండ్రులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రిన్సిపాల్ వీణ సెలవులో ఉండడంతో ఇంచార్జి ప్రిన్సిపాల్ అనురాధను అల్పాహారం, భోజనం అందించే వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో మాట్లాడి విద్యార్థినిలకు అల్పాహారం భోజనం ఎలా అందిస్తున్నారని అడగగా, ప్రతి ఆదివారం అల్పాహారం 11 దాటిన తర్వాతనే అందిస్తున్నారని, చపాతీలు మాడిపోతున్నాయని, కూరలు నాణ్యతగా, రుచికరంగా ఉండడం లేదని ఎమ్మెల్యేకు వివరించి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వంట మనుషులతో మాట్లాడి విద్యార్థినీలకు అల్పాహారం సమయానికి అందిస్తూ, నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నానని, మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం తెలంగాణ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత, ఉపాధ్యాయులతో చర్చించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, సక్రమంగా బోధన చేపట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుడు తో మాట్లాడి విద్యార్థులకు భోజనం నాణ్యతతో రుచికరంగా ఉండే విధంగా అందించాలని, భోజనం రుచికరంగా నాణ్యతగా లేకుంటే ఏజెన్సీని రద్దుచేసి వేరే వాళ్ళని నియమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, నాయకులు రామచంద్ర రెడ్డి, లక్ష్మణ్, గడ్డం బాల్రెడ్డి, పర్వత్ రావు, ఇమామ్, కిష్టయ్య, షాహిద్ పాష, సురేందర్ గౌడ్, గులాం హుస్సేన్, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed