Pcc chief: కేటీఆర్‌ కామన్‌సెన్స్‌ ఉందా? ముందు కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో చెప్పు: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |
Pcc chief: కేటీఆర్‌ కామన్‌సెన్స్‌ ఉందా? ముందు కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో చెప్పు: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైడ్రాకు, రాహుల్ గాంధీకి ఏం సంబంధమని, అసలు కేటీఆర్‌కు కామన్ సెన్స్ ఉందా అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏఐసీసీ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఇవాళ గాంధీ‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా విషయంలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని అందువల్లే కూల్చివేతలపై భయపడుతున్నారన్నారు. డీపీఆరే తయారు కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఫైర్ అయ్యారు. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్నవాటిని తొలగిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నవాటిని హైడ్రా కూల్చివేస్తుందని, మూసీ వేరు.. హైడ్రా వేరని వెల్లడించారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్‌లోని చెరువులకు పూర్వవైభవం వస్తుందన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా దూకుడుతో బాధపడుతున్నది బీఆర్ఎస్ వాళ్లేనని అందువల్లే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలనే హైడ్రా కూల్చుతుంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలోనే 317 జీవో సమస్యకు పరిష్కారం..

త్వరలో 317 జీవో సమస్యను పరిష్కరిస్తామని మహేశ్ గౌడ్ బాధితులకు హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ ఉదయం గాంధీ భవన్ ఎదుట రహదారిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేయగా వారితో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖల సమక్షంలో పీసీసీ చీఫ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 317 జీవోపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉపసంఘం సైతం వేశామన్నారు. 2021 డిసెంబర్‌లో ఈ జీవోను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ తీసుకొచ్చిందని, సమస్యను తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నాడు జీవో తెచ్చి నేడు మాపై విమర్శలా: పొన్నం

317 జీవో తెచ్చిన వాళ్లే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ 317 బాధితులకు అన్యాయం చేయమని స్పష్టం చేశారు. బాధితుల కోసం సబ్ కమిటీ వేశామని అయితే కొన్ని కారణాల వల్ల సమస్య పరిష్కారం వాయిదా పడిందని పేర్కొన్నారు. సబ్ కమిటీ అనేక అంశాలపై అధ్యయనం చేసిందన్నారు. కమిటీ సభ్యుడు శ్రీధర్ బాబు అమెరికా వెళ్లడం, అసెంబ్లీ సమావేశాల వల్ల కమిటీ సమావేశాలు జరగలేదని చెప్పారు. తప్పకుండా 317 బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed