ఉండాలా.. చావాలా.. ఓ బాధితుడి ఆవేదన..

by Sumithra |
ఉండాలా.. చావాలా.. ఓ బాధితుడి ఆవేదన..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం చిట్లం గుంట గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు ఉండాలా.. చావాలా ? అంటూ దిశతో తమ మనోవేదనను పంచుకున్నారు. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11న అలుగు వన్యప్రాణి అక్రమంగా తరలిస్తున్న కేసులో నిందితులుగా ఉన్న వారందరిని అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన విషయం అనంతరం వారు కండిషన్ బెయిల్ పై వచ్చారు. వారిలో చిట్లంకుంట గ్రామానికి చెందిన మండ్లీ వీరయ్య ఒక నిందితుడు. వీరందరూ కూడా వారంలో ఒకరోజు మద్దిమడుగు రేంజి కార్యాలయంలో హాజరై సంతకం పెట్టాలని బాధితుల తరపు లాయరు వారికి సూచించారు.

అంతవరకు బాగానే ఉంది.. కాని గురువారం ఫారెస్ట్ అధికారుల పిలుపుమేరకు అమ్రాబాద్ మండలం ఫారెస్ట్ కార్యాలయం వద్దకు రాగా.. తదుపరి అక్కడ నుంచి అటవీ శాఖ అధికారులు మన్ననూరు పిలిపించారని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో వచ్చిన వారి అందరి నుండి సంతకం తీసుకొని వారిలో మండ్లీ వీరయ్యను మాత్రం తనతో ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉందని, తదుపరి పంపిస్తామని ఆయన ఒక్కడిని ఫారెస్ట్ అధికారులు వారి వద్ద ఉంచుకున్నారని బాధితుడు వీరయ్య తెలిపారు. అందరితో పాటు వీరయ్య ఇంటికి రాకపోవడంతో.. ఏమయిందో ఏం జరిగిందో భార్య పిల్లలు మనస్థాపానికి గురయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో వీరయ్య ఇంటికి చేరుకున్నాడు. జరిగిన విషయం భార్య పిల్లలతో పంచుకున్నాడు.

తన భార్య పుస్తెలతాడు అమ్మి బెయిల్ తెచ్చింది..

బాధితుడు వీరయ్య దిశతో మాట్లాడుతూ.. వాస్తవానికి ఆ కేసులో తనకు సంబంధం లేదని, ఆ ముఠాకు సంబంధించిన వ్యక్తుల వద్ద తన నెంబరు ఉండడం వల్లనే తన పై అక్రమ కేసు బనాయించి అటవీశాఖ అధికారులు అకారణంగా జైలుకు పంపారని, తన భార్య పుస్తెలతాడు అమ్మి బెయిల్ తీసుకొచ్చిందని, తదుపరి కండిషనల్ బెయిల్ లో భాగంగా సంతకం కోసం పిలిపించుకొని అందరినీ వదిలేసి తనను ఒక్కడిని అటవీ శాఖ ఒక గదిలో ఉంచి వారు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు తన బట్టలిప్పి, బూటు కాళ్లతో తొక్కుతూ బెల్టుతో విపరీతంగా కొడుతూ.. ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లు చెప్పాలని వేధించారని కన్నీరు పెట్టుకున్నారు.

ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు అలాగే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. బూటు కాలుతో తొక్కుతూ బెల్టుతో కొడుతున్న క్రమంలో నన్ను చంపిన తన దగ్గర ఏమి సమాచారం లేదని, కాళ్ల వేలా పట్టుకున్నా వినకుండా కొట్టారని ఆవేదన చెందానన్నాడు. జరిగిన విషయం భార్య పిల్లలతో పంచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మనస్థాపానికి గురైన వీరయ్య పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, తన బాధను భార్య పిల్లలు గ్రామ పెద్దలు కలిసి తనకు జరిగిన అన్యాయం పై పోలీసులను ఆశ్రయిద్దాం అన్నారన్నారు. శుక్రవారం పదరా పీఎస్ లో ఎస్సై సెలవు పై వెళ్లడంతో అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆరోజు సాయంత్రం వరకు కేసు నమోదుకు సంబంధించి రిసిప్టును అడగగా అమ్రాబాద్ ఎస్సై సోమవారం రావాలని సూచించారని తెలిపారు. అకారణంగా ఆదివాసులను కొట్టిన అటవీశాఖ అధికారుల పై చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని బాధితుడు, గ్రామ పెద్దలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed