Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏఐ కెమెరాలు

by Y. Venkata Narasimha Reddy |
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏఐ కెమెరాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన హైదరాబాద్ శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో ప్రయాణికుల భద్రతా, తనిఖీ వ్యవస్థలను మరింగ పటిష్టం చేసేందుకు తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కెమెరాలను(AI cameras) ఏర్పాటు చేశారు. ఏఐ కెమెరాల ఏర్పాటుతో ఎయిర్‌పోర్టులో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌పోర్టులోని కీలక ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని ప్రతి కదిలికను క్షుణ్ణంగా స్కాన్ చేసి.. ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే కమాండ్ కంట్రోల్‌రూంకు సమాచారం చేరవేస్తాయి. ఏఐ కెమెరాలు ఎయిర్‌పోర్టులోని మోసాలను కూడా పక్కాగా అరికడుతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సంచరించే మనుషులు, వస్తువుల కదలికలను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూంకు పంపిస్తుంటాయి. ఓ వ్యక్తి సీసీ కెమెరా పరిధిలో 5 నిముషాల కంటే ఎక్కువ సమయం గడిపినా.. పొరపాటున తమ లగేజీని మర్చిపోయినా..ఏదైనా అనుమానస్పదంగా ఉన్న వెంటనే అలర్ట్ సమాచారం ఇస్తుంది. ఎవరైనా అనుమానాస్పద వస్తువులు వదిలేసినట్టు గ్రహిస్తే వెంటనే బాంబు స్క్వాడ్ టీంను ఏఐ కెమెరాలు అలర్ట్ చేస్తాయి. ఎయిర్‌పోర్టు రహదారుల మధ్యలో ఎవరైనా వాహనాలను నిలిపినా వెంటనే కమాండ్‌ కంట్రోల్‌రూంకు సమాచారం చేరవేస్తాయి. విమానాశ్రయం వద్ద ప్రయాణికులను మోసం చేస్తున్న క్యాబ్ డ్రైవర్లను కూడా ఈ ఏఐ సీసీ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశముంది. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐ కెమెరాలు భావిస్తే ఆ సమాచారాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్‌రూంకు అలర్ట్ పంపుతాయి.

Advertisement

Next Story

Most Viewed