మార్కెట్‌ కమిటీల్లో పదవుల పందేరం

by Mahesh |
మార్కెట్‌ కమిటీల్లో పదవుల పందేరం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల పందేరానికి దాదాపు కొలిక్కి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో నియమితులైన వారికి ప్రభుత్వం ఈ నెల 8న నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ప్రతి జిల్లా నుంచి ఆశావహులు ఎంపిక చేసి కార్పొరేషన్ , నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నిచ్చింది ప్రభుత్వం. ఇక జిల్లా ద్వితీయ శ్రేణి నాయకులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మార్కెట్ కమిటీ పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఆయా పదవులను తమ అనుయాయులకు ఇప్పించేందుకు తతంగం నడిపిస్తున్నారు.

ఇప్పటికే ఏ మార్కెట్ కమిటీకి ఎవరిని నియమించాలో తమ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొదలుకుని చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సంబంధిత పేర్లను కూడా వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొత్త పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల జాబితా సిద్దమైంది. కొన్ని మార్కెట్ల పాలకవర్గాల ఉండగా మరికొన్నింటికి ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయి. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే ప్రకటించిన నేపథ్యంలో ఆశావాహులు రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ ఐదు పర్యాయాలు ఇదివరకే నిర్ణయించడంతో ఏ మార్కెట్ లో ఇప్పుడు ఎవరికి అవకాశం వస్తుందోనన్న ఆశలు రేకెత్తిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో ఏడు మార్కెట్ కమిటీలను పరిశీలిస్తే రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించారు. ప్రధానంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు గత పాలకవర్గంలో బీసీ మహిళలకు, బోధన్ లో ఓసీ మహిళ, ఆర్మూర్ లో ఓసీ మహిళ, వర్నిలో ఓసీ, కమ్మర్ పల్లిలో బీసీ బీ, కోటగిరి లో ఓసీ, వేల్పూర్ లో ఎస్టీ మహిళలకు చైర్మన్ పదవులు దక్కాయి. రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ ప్రకారం ఉండటంతో ఈసారి రెండవ దఫా నిజామాబాద్ చైర్మన్ పదవి ఓసీ, బోధన్ ఎస్సీ మహిళ, ఆర్మూర్ బీసీ బీ, వర్ని ఓసీ మహిళ, కమ్మర్ పల్లి ఎస్టీ, కోటగిరి ఓసీ మహిళ, వేల్పూర్ ఓసీ కి దక్కింది.

మూడో విడతలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఎస్టీకి, బోధన్ ఓసీ, ఆర్మూర్ ఎస్టీ, వర్ని ఎస్సీ, కమ్మర్ పల్లి ఓసీ, కోటగిరి ఓసీ, వేల్పూర్ బీసీ బీకి కేటాయించారు. నాలుగో విడత నిజామాబాద్ ఓసీ మహిళ, బోధన్ బీసీ ఏ, ఆర్మూర్ ఓసీ, వర్ని ఎస్టీ మహిళ, కమ్మర్ పల్లి ఎస్సీ, కోటగిరి బీసీ మహిళ, వేల్పూర్ ఓసీగా నిర్ణయించారు. ఐదో విడతలో నిజామాబాద్ బీసీ బీ, బోధన్ ఓసీ జనరల్, ఆర్మూర్ ఎస్సీ, వర్ని ఓసీ, కమ్మర్ పల్లి ఓసీ, కోటగిరి ఓసీ, వేల్పూర్ ఓసీ మహిళకు కేటాయించారు. నిజామాబాద్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్లు ఐదు దఫాలుగా వచ్చినప్పటికీ ఒక్కసారి మాత్రమే పదవులు భర్తీ చేయడంతో వారికి ఆరు నెలలు పొడిగించడంతో అక్కడ మరోసారి ఎవరికి అవకాశం లేకుండా పోయింది.

18 మంది తో పాలకవర్గం

2018 మార్చిలో నిర్ణయించిన మేరకు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఐదు పర్యాయాలు ఎవరికి రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ పదవి వస్తుందనేది ముందే ఖరారు చేశారు. ఐదు విడతల తర్వాత మళ్లీ మొదటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియమ మొదలవుతుంది. పాలకవర్గం మొత్తం 18 మంది సభ్యులుంటారు. ఇందులో 12 మంది రైతులు, ఇద్దరు వ్యాపారులు, ఎక్స్ ఆఫీషియో కింద మరో నలుగురు ఉంటారు. రైతుల నుంచి చైర్మన్ ను ఎన్నుకునేలా మార్గదర్శకాలు ఉన్నాయి. పదవీకాలం రెండేళ్లు ఉంటుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది మార్కెట్ కమిటీ పదవులపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. అయితే స్థానిక లీడర్లకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ జండాను నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయా లేక వలస లీడర్లకు పదవులు దక్కుతాయ అన్న చర్చ కూడా జరుగుతుంది.

ఎందుకంటే వారు కేవలం అధికారం కోసం పార్టీలు మారారు తాను కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పని చేశామని చాలా మంది నేతలు వాపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పంపిన సిఫారసు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేవా అని చాలా మందిలో సంశయం వ్యక్తం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. జిల్లాలో ఐదుగురికి కార్పొరేషన్ పదవులు దక్కగా ద్వితీయ శ్రేణి నాయకులు మార్కెట్ కమిటీలపై గంపెడాశలు పెట్టుకున్నారు.

Next Story

Most Viewed