పుష్కరకాలం నాటి సమస్యకు పరిష్కారం..

by Sumithra |   ( Updated:2023-02-13 11:36:21.0  )
పుష్కరకాలం నాటి సమస్యకు పరిష్కారం..
X

దిశ, నిజామాబాద్ సిటీ : గడిచిన పుష్కరకాలం నుండి నెలకొని ఉన్నసమస్యకు స్థలదాత చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. డిచ్పల్లి మండలం కొరట్ పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం విషయం స్థల వివాదం తలెత్తడంతో గత 12 సంవత్సరాల నుండి ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి, స్థలవివాదం విషయమై కాలనీవాసులతో చర్చించారు. ఈ సందర్భంగా స్థానికుడైన సురసాని రాంరెడ్డి డ్రైనేజీ నిర్మాణం కోసం తనసొంత పట్టా భూమిని అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉదారత్వాన్ని చాటుకున్నారు.

రాంరెడ్డి చొరవతో కొరట్ పల్లిలో సుదీర్ఘ కాలం నుండి అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్య కొలిక్కి వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లాకలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో స్థలదాత రాంరెడ్డిని అభినందిస్తూ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ, జెడ్పీసీఈఓ గోవింద్, డీఆర్ డీఓ పీ.డీ చందర్, నిజామాబాద్ డీ.ఎల్.పీ.ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story