- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ :అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలనే మహోన్నత సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో.. భవిష్యజ్యోతి ట్రస్ట్ ను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ ట్రస్ట్ కు అన్ని వర్గాలకు చెందిన దాతలు విరివిగా విరాళాలు సమకూర్చి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో.. అనాధ పిల్లల కోసం ఏర్పాటైన ట్రస్ట్ ను కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. శనివారం కోర్టు భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల అధ్యక్షత వహించగా..పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నా అనేవారెవరూ లేని అనాధ బాలికలకు ప్రాథమిక దశ నుండే నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే దృక్పధంతో.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నెలకొల్పిన ట్రస్ట్ కు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాధారణంగా న్యాయ సేవాధికార సంస్థలు లోక్ అదాలత్ ల నిర్వహణ, న్యాయ పరమైన అంశాలపై అవగాహన సదస్సులు వంటి వాటికే పరిమితమవుతాయని, అందుకు భిన్నంగా నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అన్ని శాఖలను సమన్వయము చేసుకుంటూ విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండడం ముదావహం అని ప్రశంసించారు. స్వీయ రక్షణ కోసం రికార్డు స్థాయిలో 11 వేల మంది బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించడం, గ్రామాభివృద్ధి కమిటీల పనితీరును పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను డీఎల్ఎస్ఏ చేపట్టిందని గుర్తు చేశారు. ఇదే కోవలో అనాధ బాలలకు మెరుగైన విద్యను అందించాలనే సదాశయంతో ట్రస్ట్ ను నెలకొల్పడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అనాథలం అనే భావనను విడనాడి, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. అనాధ బాలలకు ఉచితంగా ప్రవేశాలు కల్పించిన కాకతీయ స్కూల్, రవి పబ్లిక్ స్కూల్, నిర్మల హృదయ్ పాఠశాలల యాజమాన్యాలను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ..నిజామాబాద్ లోని బాలసదన్ లో ఆశ్రయం పొందుతున్న అనాధ బాలలకు నాణ్యమైన విద్యను ఇప్పిస్తూ..వారికి అన్ని విధాలుగా తోడ్పాటుగా నిలవాలనే ఆశయంతో భవిష్య జ్యోతి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల చదువుతో పాటు వారికి అవసరమైన ఇతర సదుపాయాలన్ని ట్రస్ట్ తో సమకూరుస్తామని తెలిపారు. కోరిన వెంటనే 30 మంది అనాధ బాలికలకు ఉచితంగా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన కాకతీయ, రవి పబ్లిక్, నిర్మల హృదయ్ పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున జిల్లా జడ్జి కృతజ్ఞతలు ప్రకటించారు. అదేవిధంగా నలుగురు అనాధ బాలలను పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ దత్తత తీసుకున్నారని తెలుపుతూ..సీ.పీ కనబర్చిన సేవా దృక్పథాన్ని అభినందించారు. అనాధ బాలలకు చక్కటి భవిష్యత్తును అందించేందుకు వీలుగా దాతలు భవిష్య జ్యోతి ట్రస్ట్ కు విరాళాలు అందించి తమ ఉదారత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ పేరిట ప్రత్యేకంగా నిజామాబాద్ నగరంలోని ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకు, నాందేవ్ వాడ బ్రాంచ్ లో అకౌంట్ ను తెరవడం జరిగిందని తెలిపారు. దాతలు తమ విరాళాలను భవిష్య జ్యోతి, అకౌంట్ నెంబర్: 354705001646, ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్: ఐసీఐసీ003547, ఐసీఐసీఐ బ్యాంకు, నాందేవ్ వాడ బ్రాంచ్ లో జమ చేయవచ్చని సూచించారు.
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ..అనాధ బాలలను దత్తత తీసుకునే అవకాశం కలగడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను బదిలీపై వెళ్తున్నప్పటికీ దత్తత తీసుకున్న బాలలకు తనవంతు తోడ్పాటును అందిస్తుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టీ.శ్రీనివాస్, ప్రైవేట్ విద్య సంస్థల నిర్వాహకులు రజనీకాంత్, సరళా మహేందర్, న్యాయాధికారులు, బాలసదన్ చిన్నారులు పాల్గొన్నారు.