నోటిఫికేషన్ లోపే మన కంట్రోల్‌లోకి రావాలి.. నేతలకు CM రేవంత్ కీలక ఆదేశం

by GSrikanth |
నోటిఫికేషన్ లోపే మన కంట్రోల్‌లోకి రావాలి.. నేతలకు CM రేవంత్ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతికూలతలను అధిగమించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. అందుకోసం పార్టీ బలహీనంగా ఉన్న సెగ్మెంట్లలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి వలసలను ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నది. ఎన్నికల నాటికి విపక్ష పార్టీలకు లీడర్లు, కేడర్ లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ లీడర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది.

గ్రేటర్‌లో బలం పెంచుకునేలా ప్లాన్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలవకపోవడమే ఇందుకు ఉదాహరణ. కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి గడ్డు పరిస్థితులు రాకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన ఫాలోవర్స్ మొత్తం కాంగ్రెస్ గూటికి వస్తున్నారు. ఇంకా, గులాబీ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యూహాత్మకంగా పార్టీ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీని రంగంలోకి దింపారు. ఆమె స్వయంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. త్వరలో సుమారు 25 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈలోపు గ్రేటర్ పరిధిలో విపక్ష లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని సీఎం లీడర్లకు టార్గెట్ పెట్టినట్టు సమాచారం.

మూడంచెలుగా సమన్వయ కమిటీలు

రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి లోకసభ ఎన్నికలపై తన ఇంట్లో రివ్యూలు నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న నేతలను పిలిచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం లోకసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మూడంచెల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్లమెంట్, అసెంబ్లీ, బూత్ స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మూడంచెలుగా కమిటీలను ఏర్పాటు చేయడం వల్లే తాను మల్కాజిగిరిలో విజయం సాధించానని గుర్తుచేస్తున్నారు. ప్రతి నిత్యం ఈ మూడు కమిటీల మధ్య పని విభజనలో సమన్వయం ఉంటే గెలుపు సులువు అవుతుందని వివరిస్తున్నారు.

ఆ మూడు స్థానాలపై స్పెషల్ ఫోకస్

సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోకసభ స్థానాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మూడు సెగ్మంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్‌గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. మల్కాజిగిరి తన సిట్టింగ్ ఎంపీ స్థానం. అక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించకపోతే ఇంటాబయటా విమర్శలు తప్పవనే చర్చ ఉంది. చేవెళ్ల లోకసభ స్థానం ఎన్నికల ఇన్‌చార్జీగా పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని నియమించింది. దీంతో అక్కడ పార్టీని గెలిపించడం కోసం అభ్యర్థుల ఎంపిక నుంచే కీలకంగా వ్యవహరించారు. ముందుగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ప్లాన్ చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిని ఢీ కొట్టే శక్తి, సామర్థ్యాలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే ఉన్నాయనే ఉద్దేశంతో ఆయనను పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయినట్టు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ పరిధిలో కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు దానంను పార్టీలోకి చేర్చుకోవడం కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story