కొత్త, పాత నేతల మధ్య సమన్వయలోపం.. టీ కాంగ్రెస్‌లో కొత్త తలనెప్పి

by karthikeya |   ( Updated:2024-10-23 03:12:05.0  )
కొత్త, పాత నేతల మధ్య సమన్వయలోపం..  టీ కాంగ్రెస్‌లో కొత్త తలనెప్పి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య ఇప్పటికీ సమన్వయం కుదరలేదు. దీంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు మొదలవుతున్నాయి. జగిత్యాల ఘటనతో పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే విషయం మరోసారి తేటతెల్లమైంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పరిశీలించిన తర్వాత పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం మరింత హైలెట్ అయింది. ఈ ఘటన ఒక్కటే కాదు.. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పార్టీలో గ్రూప్ వార్ లు కొనసాగుతునే ఉన్నాయి. ఇటీవల ఏకంగా మంత్రి కొండా సురేఖపై పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు అందింది. ఏకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతకంటే ముందు బాన్సువాడలో పార్టీ యాక్టివిటీస్ అమలు, కార్యక్రమాల్లో ప్రొటోకాల్ అంశాల్లో లొల్లి జరిగింది. పోచారం వర్సెస్ కాంగ్రెస్ ఇన్ చార్జీ ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఇష్యూ కొనసాగుతున్నది. వివాదం క్లోజ్ చేయాలని, సీనియర్ ఎమ్మెల్యే పార్టీలోకి రావడంతో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ స్వయంగా పీసీసీ చీఫ్ ఏనుగు రవీందర్ రెడ్డికి సూచించారు. కానీ ఆయన ఆ ఆదేశాలను ఏమీ పట్టించుకోకుండా, తానే ఇన్ చార్జీనంటూ పార్టీ యాక్టివిటీస్, ప్రోగ్రామ్ లలో తనకే ప్రయారిటీ ఉంటుందంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఇక స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ లోనే మేయర్ విజయలక్ష్మీ, కార్పొరేటర్ విజయారెడ్డి దుర్బషలాడుకున్నారు. మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సమస్య పార్టీని చిక్కుల్లో పెడుతున్నది. వీటన్నింటికీ చెక్ పెట్టాలని పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. సీఎం, మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ గ్రూప్ పాలిటిక్స్ ను అణిచివేయాలని పట్టుపట్టారు. ఇందుకు తగిన కసరత్తును పీసీసీ చేస్తున్నది.

ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు..?

పార్టీ ఏజెండాను అమలు చేయడం నేతల బాధ్యత అని పీసీసీ చీఫ్ స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన నొక్కి చెబుతున్నారు. ఇదే అంశంపై నేతలందరికీ అవగాహన సదస్సు పెట్టాలని పీసీసీ ఆలోచిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీలు, ఇతర కీలక నేతలతో నిర్వహించాలని భావిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో సీరియస్ గా సమన్వయం మీటింగ్ ను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు నేతల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం, గ్రూప్ వివాదాలు వంటి ఇష్యూలకు చెక్ పెట్టకపోతే స్థానిక సంస్థల్లో నష్టం జరుగుతుందని పార్టీ భావిస్తోంది. పదేళ్ల పవర్ టార్గెట్ కు లోకల్ బాడీ ఎన్నికలే కీలకమంటూ ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి కూడా పార్టీకి సూచించారు. ఈ మేరకు కొత్తగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శులు కూడా జిల్లాల్లోని పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏఐసీసీ కి రిపోర్టు అందజేస్తున్నారు. దీంతో కొత్త పీసీసీ చీఫ్ తన ముందున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని లక్ష్యం పెట్టుకున్నారు.

Advertisement

Next Story