మాజీ మంత్రి KTR ‘ట్వీట్’ బ్యాక్ ఫైర్.. మీ ఓటమికి అసలు కారణం అదేనంటూ నెటిజన్స్ ఫైర్..!

by Satheesh |   ( Updated:2024-01-01 08:13:53.0  )
మాజీ మంత్రి KTR ‘ట్వీట్’ బ్యాక్ ఫైర్.. మీ ఓటమికి అసలు కారణం అదేనంటూ నెటిజన్స్ ఫైర్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు సార్లు మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ కోసం చేసిన ట్రిక్కులు పని చేయలేదు. మూడోసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ఇటువంటి తరుణంలో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే మేమే అధికారంలోకి వచ్చేవారమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వంపై 32 యూట్యూబ్ చానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్న ఓ నెటిజన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకోవడమే:

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తమ ఓటమి నెపాన్ని కేటీఆర్ 32 యూట్యూబ్ చానెళ్లపైకి నెట్టడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం అంటే కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకోవడమే అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ స్పందిస్తూ 'మీరు కొత్తగా చానెల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మాదాపూర్ ఆఫీస్‌లో మీరు టేకోవర్ చేసిన 32కి పైగా యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నాయి కదా? వాటికి తోడు మీ సొంత టీ న్యూస్‌తో పాటు ఎలక్షన్స్‌కు ముందు నుంచి అనేక శాటిలైట్ చానల్స్ కూడా మీకు సపోర్ట్‌గానే ఉన్నాయి కదా' అని ప్రశ్నించగా.. అంటే ఓ యూట్యూబర్ ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థాయిలో బీఆర్ఎస్ ఉందా అని మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ఇక ఎన్నికలకు ముందు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో ఫేక్ లెటర్ ప్రచారం చేసిన మీరా తప్పుడు ప్రచారం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

మీ ఓటమికి కారణం అదే:

కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఫలితాల నుంచి ఆ పార్టీ ఇంకా ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదని తెలుస్తోందని.. మీ ఓటమికి మీ అహంకారమే కారణం అనే కామెంట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ ఓటమి స్వయంకృతాపారాధమే అని.. తుమ్మల, పొంగులేటి వంటి నేతలను దూరం చేసుకుని కబ్జాకోరు పువ్వాడపై ఆధారపడ్డారని, కేసీఆర్ కుటుంబ పాలన, అహంకార పూరిత ధోరణిని ప్రజలు సహించలేకపోయారని, కాళేశ్వరం మరియు మిషన్ భగీరథలో అవినీతి ఆరోపణలు, సీఎంతో సహా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని ఇకనైనా ఓన్ ఇచ్చే ఫీడ్ బ్యాక్‌పై కాకుండా వాస్తవాలను గ్రహించాలని, మీ స్వంత సర్కిల్ నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నంత కాలం మీకు ఫలితం దక్కదంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed