సాగర్‌కు భారీగా వరద..26 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల

by Nagam Mallesh |
సాగర్‌కు భారీగా వరద..26 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దాంతో అధికారులు నాగార్జున సాగర్‌ 26 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. పాల నురగలా స్పీల్‌ వే గుండా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 3,12,093 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 309 టీఎంసీలు ఉన్నాయి. గరిష్ట నీటిమట్టం 590 అడుగులకుగాను 589.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులోని 26 గేట్లలో ఎనిమిది గేట్లను పది అడుగుల మేర, మరో 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తివేశారు. దీంతో స్పిల్‌వే ద్వారా 2,63,168 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా, ఎడమ కాలవుకు 8280 క్యూసెక్కులు, కుడి కాలవుకు 9500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులనీరు విడుదల అవుతుంది.

పర్యటకుల సందడి..

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్​ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్​ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది. సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ‌

Advertisement

Next Story

Most Viewed