రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Anjali |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, చిలుకూరు: కోదాడ - హుజూర్నగర్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలుకూరుకు చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొందూరు ఉదయ్(28) .. మండలంలోని సీతారామపురంలో గురువారం తన మిత్రుని ఇంట్లో నిర్వహించనున్న వేడుకకు హాజరు కావాల్సి‌ఉంది. ఆ ఏర్పాట్ల నేపథ్యంలో తన మిత్రుని కలిసేందుకు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్ పై సీతారామపురం వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం అతని బైక్ ను వెనుక నుంచి ఢీ కొట్టింది.

దీంతో ఉదయ్ ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. బైక్ పై అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్షల కోసం ఉదయ్ మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బీటెక్ పూర్తి చేశాడు. త్వరలో ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నాడు. అతని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Next Story