లింగ వివక్ష లేని సమాజం కోసం కృషి : కలెక్టర్ పమేలా సత్పతి

by Sridhar Babu |   ( Updated:2022-11-25 15:12:06.0  )
లింగ వివక్ష లేని సమాజం కోసం కృషి :  కలెక్టర్ పమేలా సత్పతి
X

దిశ,యాదాద్రి కలెక్టరేట్ : స్త్రీలు, బాలికల పట్ల జరుగుతున్న హింస, వేధింపుల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి తమ వంతు కృషి అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినంను పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం చర్చా వేదిక నిర్వహించారు. బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ జయశ్రీ, సఖి సెంటర్ కోఆర్డినేటర్ ప్రమీల, బాల రక్ష కోఆర్డినేటర్ చందనేశ్వరి, జిల్లా మహిళా అధికారులు, జిల్లా అధికారులు చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీలు, బాలికల పట్ల శారీరక, మానసికంగా ఏ రూపంలో దాడి జరిగినా అది వారి పట్ల హింసేనని, జిల్లా స్థాయి లోకల్ కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సఖి కేంద్రం ద్వారా బాధిత మహిళలకు సత్వర సహాయం అందించడం జరుగుతుందని, మహిళా హెల్ప్ లైన్ 181 నెంబర్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పరిస్థితులు తమకు వ్యతిరేకంగా ఉన్నా కూడా స్త్రీలు తమ స్వాభిమానాన్ని విడవకుండా సాధికరతతో పరిస్థితులను అధిగమించాలని అన్నారు. లింగ వివక్ష, హింస లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.

జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముందు మన ఆలోచనా విధానం మారాలని, బయట జరిగేది మాత్రమే కాకుండా మన ఇంటిలో కూడా గమనించాలని, మహిళల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని అన్నారు. లింగ వివక్షతో భ్రూణ హత్యలతో అసలు ఈ లోకానికే రాకుండా చేస్తున్నారని, తెలిసి కూడా అబార్షన్లకు పాల్పడుతున్నారని, సమాజంలో ఈ దురాచారం పూర్తిగా సమసిపోవాలని అన్నారు. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరికి సమానస్థాయి విద్య అందించాలని, ఆస్తిలో సమాన హక్కు అందించాలని, అన్నింటికి విద్య మూలమని, అమ్మాయిలను చదివించాలని, వారిని ఎదిగినంత ఎదగనిద్దామని, వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుదామని అన్నారు. చర్చా వేదికలో పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. స్త్రీల హక్కుల రక్షణకు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగిందని, స్త్రీల రక్షణకు, హక్కులకు చట్ట సభలలో చర్చ జరుపుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వారి పట్ల వివక్షను, హింసను విడనాడే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా ఉద్యాన అధికారి అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, సిడిపిఓలు స్వరాజ్యం, చంద్రకళ, శైలజ, జ్యోత్స్న, వివిధ కార్యాలయాల మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed