సాయిబాబా తొమ్మిదేళ్ల నిర్భంధానికి బాధ్యులు ఎవరు? కోదండరామ్ ఫైర్

by Ramesh N |
సాయిబాబా తొమ్మిదేళ్ల నిర్భంధానికి బాధ్యులు ఎవరు?  కోదండరామ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జన సమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరామ్ ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయిబాబా మృతి అత్యంత బాధాకరమైనదని అన్నారు. తాను సెంట్రల్ యూనివర్సిటి స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి సాయిబాబాను చూస్తున్నట్లు గుర్తుచేసుకున్నారు. తప్పు జరిగితే ఎదిరించి నిలబడి పోరాటం చేయడం అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నానని వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆయన పట్ల చాలా దుర్మార్గం.. చాలా పాశవికంగా వ్యవహరించిందన్నారు. తొమ్మిది ఏండ్లు జైల్లో పెట్టి.. చివరికి కోర్టు నిర్దోషి అని తేల్చిందన్నారు.

ఈ తొమ్మిదేండ్లు నిర్భంధానికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు. దానికి ఇప్పటివరకు సమాధానం రాలేదన్నారు. ఆయన జైల్లో దుర్భరమైన జీవితం గడిపారని, చివరికి ఆయన తల్లి అంత్యక్రియలకు కూడా బెయిల్ అవకాశం ఇవ్వలేదన్నారు. అంత పాశవికంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల సాయిబాబా చనిపోయారని భావించారు. సాయిబాబా చనిపోవడానికి భాద్యులు కేంద్ర ప్రభుత్వమే అని ఆరోపించారు. మనుషులను రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు నేరస్తులుగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తప్పు చేస్తే శిక్షించాలని, అభిప్రాయం తెలియజేస్తే నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed