హైవేలపై బ్లాక్ స్పాట్స్.. అధికారులకు మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశం

by Satheesh |
హైవేలపై బ్లాక్ స్పాట్స్.. అధికారులకు మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఇందుకు తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్‌‌ను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నామని రోడ్లు ,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. సచివాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐ) రోడ్లు భవనాల శాఖ అధికారులతో పాటు గ్రేటర్ కమిషనర్‌తో పాటు ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షించారు.

బ్లాక్‌ స్పాట్స్‌ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన రహదారి భద్రతా చర్యలతో పాటు తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాల్లో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌-విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్‌ స్పాట్స్‌‌లను గుర్తించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన రహదారుల శాఖ ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించవచ్చని, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్‌ను మంత్రికి వివరించారు. వర్షాకాలం రానుండడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు.

బ్లాక్ స్పాట్స్‌తో బీ కేర్ ఫుల్..

ఆర్ అండ్ బీ శాఖ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను గుర్తించారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట టౌన్‌లోని ఎస్వీ కాలేజ్, జనగాం క్రాస్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, మునగాల మండలం ముకుందాపురం, ఆకుపాముల, కోమరబండ, కటకొమ్ముగూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం ఎక్స్ రోడ్, నవాబ్ పేట జంక్షన్ ప్రాంతాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు రహదారుల శాఖ గుర్తించింది.

ప్రమాదాల నివారణకు ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్ మెంట్స్, వెహికిల్ అండర్ పాస్‌ల నిర్మాణం, రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్అండ్​బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల ప్రాంతీయ అధికారి రజాక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed