రక్షించాల్సిన ఎస్సై భయపెడుతున్నాడని బాధితురాలి ఆవేదన.

by Aamani |   ( Updated:2024-10-11 11:37:18.0  )
రక్షించాల్సిన ఎస్సై భయపెడుతున్నాడని బాధితురాలి ఆవేదన.
X

దిశ, కూకట్​పల్లి: ఆపద వచ్చింది, న్యాయం చేయండి అంటు పోలీసు స్టేషన్​ మెట్లు ఎక్కడమే మహిళ పాలిట శాపంగా మారింది. ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడమే ఆ మహిళతో పాటు కుటుంబ సభ్యులను ఇబ్బందుల పాలు చేసింది. తమ కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా బీరప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మూసాపేట్​ రాఘవేంద్ర సొసైటీకి చెందిన సునీత పునియ(38) గత నెల 19వ తేదీ కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో సెక్టార్​ ఎస్సై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తానని చెప్పి కాలయాపన చేస్తుండటంతో మహిళ తెలిసిన పెద్దలను ఆశ్రయించింది. దీంతో ఎస్సై బాధిత మహిళ సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నంబర్​ 1201/2024, 79బిఎన్​ఎస్​ సెక్షన్​ కింద కేసు నమోదు చేశాడు.

ఇదిలా ఉండగా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన మహిళ తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్​ చేయాలంటూ వేడుకుంటే అతడు లేడు, పరారీలో ఉన్నాడని దాట వేస్తునే బాధిత మహిళతో పాటు మహిళ కుటుంబ సభ్యులపై అదే రోజు బీరప్ప ఇంటిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేసినట్లు బాధిత మహిళ వాపోయింది. తనను బీరప్పతో పాటు మరికొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భయపెడుతున్నారని, కాలనీలో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని బెదిరస్తున్నారని, వాళ్లకు ఎస్సై పూర్తిగా సహకరిస్తున్నారని సునీత కన్నీటి పర్యంతం అయింది. దానికి తోడు ఎస్సై తనకు బుధవారం సద్దుల బతుకమ్మ రోజు ఫోన్​ చేసి పోలీస్​ స్టేషన్​కు రావాలని, ఆధార్​ కార్డు, ఫోటోలు తీసుకుని రమ్మని బెదిరించారని సునీత ఆరోపించింది. మీకు బ్యాక్​గ్రౌండ్​ ఏముంది, మీతో నలుగురు కూడా లేరు వాళ్లు మీపై ఎస్సీ, ఎస్టీ కేసు బుక్​ చేస్తున్నారు. మీ పై కేసు నమోదయింది అంటు ఎస్సై బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్సై పై, తనతో అసభ్యంగా ప్రవర్తించిన బీరప్పపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్టు బాధిత మహిళ సునిత తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed