బొబ్బఖాన్ చెరువులో బోలెడన్ని కబ్జాలు

by Kalyani |
బొబ్బఖాన్ చెరువులో బోలెడన్ని కబ్జాలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న చెరువుల స్థితిగతులపై సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన సమీక్షలో దాదాపుగా అన్ని చెరువుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఇందులో బహుదూర్ పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీ పరిసరాలలో ఉన్న చెరువులపై జరిగిన చర్చ అంశం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఉన్న బొబ్బ ఖాన్ (బాబా ఖాన్) చెరువుకు సమీపంలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీ ఉండటం, యూనివర్సిటీ లోపల సైతం ఒక చెరువు ఉన్నట్లుగా అధికారులు గుర్తించటం ఆ వీడియో సారాంశం. కాగా దుండిగల్ గండి మైసమ్మ మండలం బహదూర్ పల్లి గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్న బొబ్బ ఖాన్ చెరువు బఫర్ జోన్ లో వెలసిన అక్రమ నిర్మాణాలపై కథనం.

బాబాఖాన్ చెరువు…

బహదూర్ పల్లి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 67, 69, 71, 73, 74, 76, 77, 78, 80 లలో చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ ప్రాంతాలు ఉన్నాయి. సర్వే నెంబర్ 76 లో సింహభాగం చెరువు ఉండగా మొత్తంగా 38 ఎకరాల విస్తీర్ణంలో బాబా ఖాన్ చెరువు ఉన్నట్లుగా రికార్డును చెబుతున్నాయి. సర్వేనెంబర్ 69, 67, 76, 77, 78, 71 లో ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం, చెరువు బఫర్ జోన్ లో రాగా, కొన్ని పరిశ్రమలు సైతం బఫర్ జోన్ లోని నిర్మించారు.

బఫర్ జోన్ లో బోలెడన్ని..

చెరువు ఎఫ్ టి ఎల్ ప్రాంతంలో మట్టి వేసి పూడ్చివేసే పనులు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు బఫర్ జోన్ ప్రాంతాల్లో ఇప్పటికే బోలెడన్ని కబ్జాలు వెలిశాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించిన ఓ ఫంక్షన్ హాల్ సైతం బఫర్ జోన్ లోనే ఉంది. 2023 డిసెంబర్ నెల వరకు ఈ ఫంక్షన్ హాల్ తో పాటుగా 20 నిర్మాణాలు బఫర్ జోన్ లో వెలిశాయి. ఇవి అన్ని వాణిజ్యపరంగానే కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే రెండు నిర్మాణాలు తాజాగా చేపట్టి పూర్తి చేశారు కూడా. అంతేకాకుండా టెక్ మహీంద్రా వైపు కూడా చెరువును పూడ్చివేసి నిర్మాణాలు చేపడుతున్నారు.

టెక్ మహీంద్రా యూనివర్సిటీలో..

ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న టెక్ మహీంద్రా యూనివర్సిటీ లోపల సైతం ఒక చెరువు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఐదు ఎకరాల కు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువు 2014 వరకు రెండు ఎకరాల వరకు కబ్జా అయినట్లు తదనంతరం పది సంవత్సరాల కాలంలో చెరువు పూర్తిగా ఉనికిని కోల్పోయి కబ్జాకు గురైనట్లుగా తెలుస్తుంది. ఇదే విషయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ప్రత్యేకంగా అధికారులు అడిగి తెలుసుకుంటున్న వీడియో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. త్వరలో బొబ్బ ఖాన్ చెరువుతోపాటుగా పిర్జాది కుంటలు వెలిసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం తథ్యమని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed