బీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు ‘గద్దర్ దళం’..!

by Kalyani |
బీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు ‘గద్దర్ దళం’..!
X

దిశ, మేడ్చల్ ప్రతినిధి: తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ ను బొంద పెట్టడమే ‘గద్దర్ దళం‘ ధ్యేయమని ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్నారు. గద్దర్ పై కాల్పులు జరిపి గురువారం నాటికి 26 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ చంద్రకిరణ్ కమ్యూనిటీ హాల్ లో ఓట్ల విప్లవం వర్దిల్లాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గద్దర్ పై జరిపిన కాల్పుల ఘటనను ‘మరపురాని మాయని గాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 26 సంవత్సరాల పునర్జన్మ జన్మదిన శుభాకాంక్షలు గా పలువురు గద్దర్ కు తెలిపారు. కార్యక్రమానికి ముందు గద్దర్ మాట్లాడుతూ.. 75 సంవత్సరాలుగా తన జీవితం పోరాటాలతోనే కొనసాగుతున్నదని అన్నారు.

మిగితా శేష జీవితాన్ని తన సతీమణి విమలతో కలసి కొత్తగా ‘గద్దర్ దళం’ అనే సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. గద్దర్ దళంకు కన్వీనర్ గా విమల గద్దర్ ను నియమిస్తున్నానని, తాను మాత్రం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహకుడిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. రాష్ట్రమంతటా మూడు నెలలపాటు తిరిగి పలు జిల్లాలలో మీటింగ్ లు పెట్టబోతున్నట్లు చెప్పారు. జిల్లాల మీటింగ్ అనంతరం లక్షలాది కళాకారులతో భారీ సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సదస్సులోనే గద్దర్ దళం కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అయితే గద్దర్ దళం అయితేనే బాగుంటుందా...? లేక మరేదైనా పేర్లను కూడా సూచించవచ్చని కోరారు.

బీఆర్ఎస్ పార్టీతో తప్ప వేరే ఇతర పార్టీలతో గద్దర్ దళం పనిచేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమణలను ప్రజలకు కళ ప్రదర్శనల ద్వారా తెలియజేస్తామన్నారు. గద్దర్ అంటే విప్లవం అని అభివర్ణించారు. ప్రజలను జాగృతం చేసేందుకు రాష్ట్రం మొత్తం తిరగడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి, కళాకారులకు, రచయితలకు, డప్పు కళాకారులకు బాసటగా ఉంటానని గద్దర్ తెలియజేశారు. డప్పు కళాకారులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మాస్టర్ జి, జెవి, రాజు, హరినాథ్, నేర్నాల కిషోర్, ఏపూరి సోమన్న, వెంకటాచారి, సీ.ఎల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed