మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందో…?

by Kalyani |
మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందో…?
X

దిశ,దుబ్బాక : దుబ్బాక నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పీఠం ఎవరికి దక్కుతుందోనన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ కమిటీలను సైతం రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఆశలు మరింత రేకేత్తిస్తున్నాయి. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఇకపై తమకు దక్కాల్సిన నామినేటేడ్‌ పదవులపై కాంగ్రెస్‌ నేతలు దృష్టి సారిస్తున్నారు.

మార్కెట్‌ కమిటీలు, పంచాయతీ, మండల స్థాయిలో ఉండే ప్రొటోకాల్‌ పదవులపై కాంగ్రెస్‌ నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దుబ్బాక మండలం మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఓసి జనరల్ రావడంతో దీంతో పాలకవర్గాలకు సారథ్యం వహించే చైర్మన్‌ పదవుల కోసం అధికార పార్టీలో పోటీ నెలకొన్నది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేని పదేళ్ల కాలం పాటు పార్టీకి కష్టకాలంలో కూడా పని చేశామని ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నామినేటేడ్‌ పదవులతో తమకు న్యాయం చేయాలని పార్టీ నాయకులు నియోజకవర్గం ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వద్ద తమ వాదనలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

అలాగే నియోజకవర్గం పరిధిలోని ప్రతీసారి చైర్మన్‌ పదవి రాయపోల్‌ మండలానికి చెందిన నాయకులకే దక్కుతుండడంతో ఈసారి చైర్మన్‌ పదవి కోసం దౌల్తాబాద్‌ మండలానికి చెందిన నాయకులు చాలామంది పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. తోగుట మార్కెట్ చైర్మన్ ఓసి జనరల్ రావడంతో తుక్కపూర్ మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి, ( అమర్ ) కు ఖరారు అయినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక మిరుదోడ్డి మండలంలో బిసి మహిళల రిజర్వేషన్ రావడంతో ఎలాగైనా ఈ సారి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలనే యోచనలో పలువురు ఆశావహులు దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.

ఎవరి ప్రయత్నాలు వారివే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం పరిధిలోని రెండు పర్యాయాలు బీఆర్ఎస్‌ పార్టీ నాయకులే మార్కెట్‌ కమిటీ చైర్మన్లుగా కొనసాగారు. దుబ్బాక మార్కెట్ చైర్మన్ గా మొదటి సారిగా గుండెల్లి ఎల్లారెడ్డి కొనసాగారు. రెండోసారి బండి శ్రీలేఖ, రాజు కొనసాగగా, మూడవ సారి చింతల జ్యోతి, కృష్ణ రెండు పర్యాయాలు కొనసాగారు. మిరుదోడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నంట బాపురెడ్డి, వల్లాల సత్యనారాయణ లు కొనసాగారు. తోగుట మండలం బక్క కనుకయ్య,గడిల అనిత లక్ష్మీ రెడ్డి,దోమల కొమరయ్య, కొనసాగారు.ఇకా దౌల్తాబాద్ మండలం మార్కెట్ చైర్మన్ గా మొదటి సారిగా రణం జ్యోతి, శ్రీనివాస్ గౌడ్, కొనసాగారు అనంతరం రాయాపోల్ మండలానికి చెందిన పడకంటి శ్రీనివాస్ గుప్తా, ఇప్ప లక్ష్మీ, కొనసాగారు.

అలాగే ప్రతీసారి చైర్మన్‌ పదవి రాయపోల్‌ మండలానికి చెందిన నాయకులకే దక్కుతుండడంతో ఈసారి చైర్మన్‌ పదవి కోసం దౌల్తాబాద్‌ మండలానికి చెందిన నాయకులు చాలామంది పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం మూడోసారి పదవీ కాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని మార్కెట్‌ కమిటీలకు ఒక్కొక్కటిగా పాలక వర్గాలను నియమిస్తుండడంతో ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోసం కాంగ్రెస్‌ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మార్కెట్‌ కమిటీ పరిధిలో ఉన్న ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ నేతలు చైర్మన్‌లు, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ల యోగం ఎవరిని వరిస్తోందోనని స్థానికులు, నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నాయకుల్లో రోజురోజుకు ఉత్కంఠ..

అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పటి నుంచి నేటి వరకు సేవలందించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేస్తూ పార్టీ కోసం నిస్వార్ధంగా కృషి చేసిన తమకే మార్కెట్ కమిటీలో పదవులు దక్కుతాయని పార్టీ సీనియర్ నాయకుల్లో ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. చైర్మన్‌ పదవి ఎంపిక అలస్యం అవుతుండడంతో నాయకుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతున్నది. ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎవరికి అవకాశం కల్పిస్తారో.! నాయకుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed