రాబోయే కాలంలో క్రీడలకు హుస్నాబాద్ వేదిక కానుంది.. మంత్రి పొన్నం ప్రభాకర్

by Sumithra |
రాబోయే కాలంలో క్రీడలకు హుస్నాబాద్ వేదిక కానుంది.. మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, హుస్నాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా చర్యలు చేపడతానని అందుకు విద్యార్థులు ఆటల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పట్టుదలతో రాణించి తల్లిదండ్రులకు, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో 68వ అండర్ -14 బాలురు, బాలికల స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అండర్ - 14 బాలికలు, బాలుర హ్యాండ్ బాల్ పోటీల్లో ఫైనల్లో రాణించిన ఆదిలాబాద్, వరంగల్ బాలికలు కరీంనగర్ వరంగల్, బాలురకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారి హుస్నాబాద్ లో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు జరగడం శుభపరిణామం అన్నారు. రాబోయే కాలంలో ఈ స్టేడియం క్రీడలకు వేదిక కావాలని అందుకు దీని విస్తీర్ణం పెంచుకొని అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడానికి బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్లే సియోలో లో స్పోర్ట్స్ యూనివర్సిటీ చూసిన తర్వాత స్ఫూర్తి పొంది యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని కేబినెట్ అప్రూవల్ కూడా అయిందని గుర్తు చేశారు. అయితే ఇందులో అడ్మిషన్ తీసుకునే ప్రక్రియలో స్పోర్ట్స్ లో ప్రావీణ్యత ఉన్న వారికే స్పోర్ట్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా రాబోయే కాలంలో స్విమ్మింగ్ పూల్, అథ్లెటిక్స్ పై శిక్షణ, షటిల్ కోర్టులో సింథటిక్ ఏర్పాటు, డ్రెస్సింగ్ రూమ్, టాయిలెట్స్ ఏర్పాటు త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. అంతకు ముందు మంత్రి పట్టణానికి చెందిన మోసర్ల ప్రతాపరెడ్డి నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సేకరించారు.

దీని ద్వారా అనుమానాలు అవసరం లేదని అందరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. అందుకు ప్రజలంతా ఎన్యూమరేటర్లకు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందించి భాగస్వాములు కావాలని కోరారు. అదే విధంగా అన్ని కుల సంఘాల నాయకులు సమాచార సేకరణకు కుల బలం ఎంతో తెలిస్తే దాని అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని, అందుకు వారు సహకరించాలని కోరారు. జీవో నెంబర్ -18 ద్వారా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఇంటింటి కుటుంబ సర్వేకు వస్తున్నారు, కాబట్టి వారు కోరిన సమాచారాన్ని ఇచ్చి బాధ్యులు కావాలని తెలిపారు. అనంతరం పట్టణంలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న బంజారా భవన్ కు రోడ్డు సమస్య పై స్థల పరిశీలన చేశారు. రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత రెడ్డి , సిద్దిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed