దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

by Shiva |
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
X

దిశ, కంది: అద్దెకు ఇల్లు కావాలంటూ ఇంట్లో చొరబడి కత్తితో బెదిరించి మహిళల నుంచి బంగారు నగలతో ఉడాయించిన ఓ దొంగను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన బొననోల్ల మహేందర్ రెడ్డి(48) పోతిరెడ్డిపల్లిలోని విద్యానగర్ నివాసం ఉంటూ కారు మెకానిక్ పని చేసేవాడు.

అయితే, నెల రోజుల క్రితం తిరుమల ఎన్ క్లేవ్ కాలనీలో ఇళ్లు అద్దెకు కావాలంటూ ఓ ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం వెంటనే తలుపులు మూసేసి ఇంట్లో ఉన్న మహిళను వెంట తెచ్చుకున్న కత్తితో బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా గతనెల 31న సాయికృష్ణ స్కూల్ వద్ద ఉన్న మరో ఇంట్లో చొరబడి మహిళ నుంచి బంగారు పుస్తెల తాడు, నగదును దోచుకెళ్లాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మహేందర్ రెడ్డి అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా ఆ రెండు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడి నుంచి మొత్తం రూ.3.20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ శివలింగం, ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story