కేసీఆర్‌.. దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచిపెడతాం : రాహుల్‌ గాంధీ

by Sumithra |   ( Updated:2023-11-26 10:37:26.0  )
కేసీఆర్‌.. దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచిపెడతాం : రాహుల్‌ గాంధీ
X

దిశ, అందోల్‌ : రాష్ట్ర ప్రజల సంపదను దోచుకున్న కేసీఆర్‌ దగ్గర నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నయాపైసాతో సహా కక్కిస్తామని, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి చేత పేదల ఖాతాల్లో డబ్బును జమచేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని అందోలు నియోజకవర్గం జోగిపేటలోని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన హజరయ్యారు. ఈ సభకు సీడబ్లు్యసీ సభ్యుడు దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో దోరల పరిపాలన, ప్రజా పరిపాలనకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోపిడీ జరిగిందని, తాను ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించానని, నాణ్యత లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో కేసీఆర్‌ చెప్తారా ? దొరల సర్కార్‌కు, ప్రజల సర్కార్‌కు మధ్య తేడా ఏంటో మేం చెప్తున్నామని, చూపిస్తామన్నారు.

రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకునే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణను ఇచ్చింది, మీరు చదువుకున్న స్కూళ్లను కాంగ్రెస్‌ కట్టించిందని, కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని కాదు కేసీఆర్‌ ఏం చేసాడు అన్నది మా సవాల్‌ అన్నారు. నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని, ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగులను రోడ్డు పాలు చేసిందన్నారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు కమీషన్‌లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచాక ఢిల్లీలో బీజేపీని కూడా ఒడిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ కాంప్రమైజ్‌ కాదని, ఆ రెండు పార్టీలను ఓడించడమే మా లక్ష్యంగా కాంగ్రెస్‌ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్, సీడబ్లు్యసీ సభ్యుడు దామోదర్‌ రాజనర్సింహ, మాజీ ఎంపీ సురేష్‌ షేట్కార్, రాష్ట్ర నాయకురాలు త్రిష దామోదర్, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యలను ప్రశ్నిస్తే.. నాపై 24 కేసులు పెట్టారు..

ప్రజా సమస్యల పై తాను ప్రశ్నిస్తే నాపై 24 కేసులను పెట్టారన్నారు. నా ఎంపీ సభ్యతాన్ని రద్దు చేసి, క్వార్టర్స్‌ను లాక్కుని పంపించేశారు. కానీ మీరు ఇల్లు లాక్కుంటే దేశ ప్రజల గుండెల్లో నేనున్నానని, వాళ్లే నా కుటుంబమని చెప్పానన్నారు. రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్‌ ఖతం చేసిందన్నారు. నేను ఫిర్యాదు చేస్తే వాళ్ల పై ఒక్క కేసు కూడా ఉండదని, తాను ప్రజాసమస్యల పై ప్రశ్నించిన 24 గంటల్లోపే నాపై కేసు నమోదవుతుందన్నారు.

తొలి కేబినేట్‌లోనే ఆరు గ్యారంటీల పై సంతకం..

ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల పాలనను చూపిస్తాం. తొలి కేబినెట్‌ సమావేశంలో ఆరు గ్యారంటీల పై సంతకం పెడతాం. మొదట మహా లక్ష్మి పథకాన్ని మహిళలకు అందిస్తాం. రూ.500లకు గ్యాస్‌ సిలీండర్, మహిళలకు ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణం, నెలకు రూ.2500, పంట పెట్టుబడికి ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. నిన్ననాతో నిరుద్యోగులు కలిసి పేపర్‌ లీకుల పై వివరించారని, వారి కోసం జాబ్‌ కార్డ్‌ తెస్తున్నామన్నారు. ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషన్‌ స్కూల్‌ ను నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.

బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒక్కటయ్యాయి..

బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని, దేశాన్ని దోచుకుంటున్నాయన్నారు. దిల్లీలో మోదీకి కేసీఆర్‌ సహకరిస్తారు. తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సాయం చేస్తారని, రాష్ట్రంలో కేసీఆర్‌ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారు’’ అని రాహుల్‌గాంధీ విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దులో మద్దతు, రైతు బిల్లుకు మద్దతు తెలిపిందని, నేను మోడి చుట్టుముట్టాలని పోతే బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటుందన్నారు. కేసీఆర్‌ వద్దకు ఈడీ, ఐటీ దాడులు ఉండవన్నారు. ప్రతి అంశంలో తెలంగాణకు మోడీ మద్దతు, లోక్‌ సభలో బీఆర్‌ఎస్‌ మబీజేపీకి మద్దతు తెలిపుతుంది. క్యాడర్‌ లేని ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల అండతో పోటీ చేస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed