అక్రమాలపై చర్యలేవి.. నేడు మెదక్ మున్సిపల్ పాలకవర్గం సమావేశం

by samatah |
అక్రమాలపై చర్యలేవి.. నేడు మెదక్ మున్సిపల్ పాలకవర్గం సమావేశం
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ లో తై బజార్ పై తాడో పేడో తేల్చేందుకు పాలకవర్గ సభ్యులు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తై బజార్ వసూళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి లక్షలు చేతులు మారిన వైనంపై ‘దిశ’ పత్రికలో వరస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.. గ్రామ పంచాయతీల్లో తై బజార్ వసూళ్లలో ప్రతియేటా రూ.లక్షలో ఆదాయం వస్తుంటే.. మెదక్ మున్సిపల్ లో వస్తున్న ఆదాయం సిబ్బంది వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఇప్పటి వరకు ఈ విషయం పట్ల పెద్దగా దృష్టి పెట్టని మున్సిపల్ కౌన్సిలర్లు దీనిపై తాడో పేడో తేల్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసిందే. సోమవారం జరిగే మున్సిపల్ పాలక వర్గం సమావేశంలో తై బజార్ లెక్కను తేల్చడంతో పాటు రద్దు చేద్దామా.. వేలం నిర్వహించి ప్రైవేట్ కు ఇద్దమా..? అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు.. విచారణ అంశంపై కూడా సభ్యులు సమావేశంలో లెవనెత్తి అవకాశం ఉన్నట్లు సమాచారం. మెదక్ మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తై బజార్ వసూళ్లలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఇటీవల ‘దిశ’ లో వరస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.. గతంలో ఏడు నెలల కోసం వేలం పాట నిర్వహిస్తే రూ.14 లక్షలకు ప్రైవేట్ వ్యక్తి తై బజార్ దక్కించుకున్నాడు. అయితే ప్రైవేట్ వ్యక్తులు చేసే వసూళ్ల పై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. వేలం పాట నిర్వహించే ముందే తై వసూళ్ల పై నిబంధనలు వివరిస్తారు.. మున్సిపల్ నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారీతిగా వ్యాపారులు, రైతుల వద్ద తై వసూళ్లు చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేసే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంది. కానీ గతంలో కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి నిబంధనలు విరుద్ధంగా వ్యాపారులు, కూరగాయలు విక్రయిస్తున్న వారి వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్న కారణంతో ప్రైవేట్ కు ఇవ్వకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కానీ అధిక డబ్బులు వసూలు చేసిన కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తై వసూళ్లు మున్సిపల్ చేపట్టడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ చిన్న వ్యాపారులకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పాలకవర్గం నిర్ణయాన్ని అభినందించారు.

కొందరి జేబులు నింపిన తై వసూళ్లు..

మెదక్ మున్సిపల్ లో తై బజార్ వసూళ్లు కొంత మందికి జేబులు నింపే బాంఢాగారంగా మారింది. మున్సిపల్ లో పని చేసే ఓ అధికారి తనకు అనుకూలమైన వారికి వసూళ్లు అప్పగించి వచ్చిన డబ్బులో నిత్యం రూ.2 వేల వరకు పక్కన బెట్టి మున్సిపల్ కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వచ్చినట్లు చూపించారు. అయితే ఇందులో ఎంత మందికి వాటాలు ముట్టయో తెలియదు.. కానీ తై వసూళ్లపై కథనాలు రావడంతో సిబ్బందిని మార్చినట్లు చెప్పి చేతులు దులుపుకున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ఒక నెలల్లో కేవలం రూ.38 వేలు రావడంతో ఏంటని కథనాలు వస్తే వసూళ్లు చేయలేదని అధికారులు చేతులు దులుపుకున్నారు. మరి ఏడు నెలల్లో వేలంతో దక్కించుకున్న వ్యక్తి రూ.14 లక్షలు వేలం పాట పాడి.. వేతనాలు ఇచ్చి తై వసూళ్లు చేసి లాభాలు ఏలా పొందాడు.. అనే దానికి అధికారులు మాత్రం సమాధానం చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలతో పాటు అధికారుల సంతకాలు లేకుండా రశీదులు ఇచ్చిన వైనంపై కూడా ఎలాంటి విచారణ అధికారులు జరపలేదు. తై బజార్ వసూళ్లు చేసే వారిని తప్పించినట్లు చెప్పి అక్రమాలపై అధికారులు, చైర్మన్ మౌన పాత్రనే వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

పాలక వర్గం నిర్ణయం కీలకం..

మున్సిపల్ లో జరుగుతున్న తై బజార్ వసూళ్ల ఆరోపణలపై సోమవారం జరిగే పాలక వర్గం సమావేశంలో సభ్యులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మున్సిపల్ లో గత మూడేళ్లుగా సాగుతున్న తై బజార్ పై పాలకవర్గం సభ్యులు పెద్దగా దృష్టి పెట్టకపోవడంపై ఇన్నాళ్లు కొంత మందికి లాభదాయకంగా మారింది. కానీ సిబ్బంది వేట వేతనాలకు సరిపడ తై బజర్ వసూళ్లు లేకపోవడం, ఇందులో కొంత మందికి లాభదాయకంగా మారడంపై అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆదాయం అంతగా రానప్పుడు మెదక్ లో తై బజార్ వసూళ్లు పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా తప్పనిసరిగా కొనసాగించాల్సి వస్తే వేలం వేసి ప్రైవేట్ కు అప్పగించాలని కోరే అవకాశం ఉంది. ప్రైవేట్ వాళ్లు పీడించి వసూళ్లు చేస్తే మున్సిపల్ నిబంధనలు ఏం చేస్తాయనే అనుమానాలు కలుగుతున్నాయి. మెదక్ మున్సిపల్ తై బజార్ వసూళ్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed