- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wyra : వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలి..పంట నష్ట పరిహారం అందని ద్రాక్షేనా..?
దిశ, వైరా : గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం అందని ద్రాక్షలా మారింది. వ్యవసాయ శాఖలోని మండల వ్యవసాయాధికారితోపాటు ఏఈఓ లు పంట నష్టపోయిన రైతులను గుర్తించటంలో పూర్తిగా విఫలం చెందారు. ఏఈవోలు క్షేత్రస్థాయి పర్యటన చేయకుండా తమ ఇష్టారాజ్యంగా జాబితాను తయారు చేసి అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. భారీ వర్షాలకు పంట నష్టపోయిన అనేకమంది అర్హులైన రైతులకు నష్టపరిహారం అందలేదు. ఏఈవోల నిర్లక్ష్యానికి పంట నష్టపోయిన అర్హులైన రైతులు బలయ్యారు. అంతేకాకుండా పంట నష్టపోని అనేకమంది రైతులకు నష్టపరిహారం అందడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఏవో, ఏఈవోలు అర్హులైన రైతులను ఎంపిక చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు . ఇంత జరిగినా జిల్లా వ్యవసాయ అధికారులు తమకేమీ తెలవనట్లు వ్యవహరించటం విశేషం . పంట నష్టపరిహారం జాబితా అధికారులు తయారు చేసిన విషయం గ్రామాల్లో రైతులకు తెలియదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో అనేక మంది అర్హులైన రైతులకు పంట నష్ట పరిహారం అందలేదు.
అర్హులకు మొండి చేయి.. అనర్హులకు పరిహారం..
వైరా మండలంలో పంట నష్టపోయిన రైతుల ఎంపికల్లో వ్యవసాయ అధికారులు అర్హులైన రైతులకు మొండి చేయి చూపారు. అదేవిధంగా అనర్హులను పంట నష్టపరిహారం కు ఎంపిక చేశారు. వ్యవసాయ అధికారులు పంట నష్టపరిహారం జాబితా తయారీలో చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వినవస్తున్నాయి . దీంతో ప్రభుత్వానికి సంబంధించిన లక్షలాది రూపాయల నిధులు గోల్మాల్ అయ్యాయి. వైరా మండలంలో మొత్తం 454 మంది రైతులకు 37 లక్షల 70 వేల 250 రూపాయలను ప్రభుత్వం నష్టపరిహారం కింద చెల్లించింది. మండలంలో అధికంగా సోమవారం గ్రామంలో 103 మంది రైతులకు, అత్యల్పంగా పుణ్య పురం గ్రామంలో ఒక్క రైతుకు నష్ట పరిహారం మంజూరయింది. అష్టగుర్తిలో 3, బ్రాహ్మణపల్లి లో 8, గన్నవరంలో 10, గొల్లెనపాడులో 32, గొల్లపూడిలో 4, ఖానాపురం లో 4, కొండకుడిమలో 66, ముసలిమడుగులో 91, లింగన్నపాలెంలో 2, నారపనేనిపల్లిలో 8, పాలడుగులో 2, పూసలపాడు లో 2, రెబ్బవరంలో 29, సిరిపురం లో 9, తాటిపూడిలో 41, వల్లపురంలో 23, విప్పలమడకలో 16 మంది రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో వేసింది. అయితే మండలంలోని సోమవారం, ముసలిమడుగు, కొండకుడిమ, గొల్లెనపాడు తాటిపూడి, వల్లాపురం, రెబ్బవరం తదితర గ్రామాల్లో అనర్హులకు పంట నష్టపరిహారం అందించినట్లు తెలుస్తోంది . ప్రధానంగా ఓ ఏఈఓ గ్రామాల్లో తన ఇష్టారాజ్యంగా పంట నష్టపోయిన రైతులను ఎంపిక చేయడం వివాదాస్పదమవుతుంది.
గ్రామాల్లో తిరగని ఏఈవోలు....
వైరా మండలంలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిస్థాయిలో చేయకుండానే ఏఈవోలు జాబితాను తయారు చేశారు. గ్రామాల్లో మొక్కుబడిగా ఇద్దరు ముగ్గురు రైతులు పొలాలను ఏఈఓలు పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాలయానికి ఫోటోలు తీసుకుని వెళ్లిన రైతుల పేర్లను జాబితాలో చేర్చారు. కనీసం పంట నష్టపరిహారం కోసం రైతులను ఎంపిక చేస్తున్నామని గ్రామాల్లో మండల స్థాయిలో ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు. కేవలం తమ ఇష్టారాజ్యంగా ఏ ఈ ఓ లు తమకు నచ్చిన పేర్లను రాయడం వివాదాస్పదమవుతుంది.
క్షమాపణ ఫుల్.... చర్యలు నిల్
వైరా మండలంలోని విప్పలమడక, పుణ్య పురం, పాలడుగు, సిరిపురం, నారపనేనిపల్లి, గన్నవరం, స్టేజి పినపాక తదితర గ్రామాల్లో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో ఏఈవోలు పరిశీలించలేదు. దీంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. ఇటీవల దిశ దినపత్రికలో పరిహారంలో జరిగిన అవకతవకలపై పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన రైతులు వ్యవసాయ అధికారులను నిలదీశారు. అయితే మండల వ్యవసాయ అధికారి మంజు ఖాన్ తప్పయింది క్షమించండి అంటూ రైతులను వేడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏఈఓ లపై అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. కేవలం రైతులకు క్షమాపణలు ఫుల్ గా చెబుతున్నారు. కానీ రైతులకు పరిహారం అందకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కనీస చర్యలు తీసుకోవటం లేదు. అంతేకాకుండా అనర్హులకు నష్టపరిహారం అందించిన ఏ ఈ ఓ ల పై కనీస చర్యలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పంట నష్టపరిహారం లో వైరా మండలంలో జరిగిన అవకతవకలపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని మండల రైతుల కోరుతున్నారు.