- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పటాన్ చెరులో వాలిన లిటిగేషన్ క్లియరెన్స్ లీడర్లు..
దిశ, సంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమణలు, ఇతర వివాదాస్పద భూములకు నిలయమైన పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత అవే దందాలు గతంలో కంటే రెట్టింపు స్థాయిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో వివిధ కారణాలతో పెండింగ్ లో పడిన వివాదాస్పద భూముల ఫైళ్లు ఇప్పుడు చకచకా కదిలిపోతున్నాయి. రెవెన్యూ అధికారులు మొదలుకొని పటాన్ చెరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకువచ్చిన ఫైళ్లను క్షణాల్లో క్లియర్ చేస్తున్నారు. పెద్దల పేరు చెప్పుకుని ఈ దందాలు చేస్తూ తక్కువ సమయంలోనే కొందరు నాయకులు రూ. కోట్లు అక్రమంగా గడిస్తున్నారని అదే పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా అందరి దృష్టి ఇప్పుడు పటాన్ చెరులోని వివాదాస్పద భూములు, ఇతర భూ దందాలపై పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమ భూదందాలు జరిగాయని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జరుగుతున్న దందాలపై ఏం సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అమీన్ పూర్ లో దందా షురూ...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు, మూడు నెలల వరకు పటాన్ చెరు ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగం పాలన సజావుగానే కొనసాగింది. ఇక ఆ తర్వాత కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. పెద్దల పేరు చెప్పుకుని దందాలు మొదలుపెట్టారు. ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద భూములను తాము దగ్గరుండి క్లియర్ చేస్తామని పైరవీలు మొదలు పెట్టారు. ప్రభుత్వ పెద్దలతో తమకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఎంత పెద్ద వివాదమైన క్లియర్ చేస్తామని సిట్టింగ్ (ఇరు వర్గాలతో పంచాయతీలు)లు పెడుతున్నారు. అమీన్ పూర్ మండలంలో వివాదం నెలకున్న పలు భూ వ్యవహారాలను కొందరు నాయకులు చక్కదిద్దుతున్న విషయం ఇటు కాంగ్రెస్, మరో వైపు బీఆర్ఎస్ నాయకులు తెలిసింది. అయినా పెద్దల పేరు చెప్పుకుని వచ్చిన సదరు నాయకులను చూసి మౌనంగా ఉండిపోయారు. ఈ విషయం రాజకీయంగా చర్చకు రావడంతో పార్టీల నాయకులు మీడియాకు సమాచారం అందించారు. అమీన్ పూర్ లో ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ దందాలపై విచారించగా పలు లిటిగేషన్ దందాలు క్లియరెన్స్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ సర్కారులో పెండింగ్..
పటాన్ చెరు నియోజకవర్గంలోని పటాన్ చెరు, రామచంద్రపురం, ఆర్సీపురం, జిన్నారం, గుమ్మడిదల, మండలాలతో పాటు తెల్లాపూర్, అమీన్ పూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీల్లో వివాదాస్పద భూములున్నాయి. ప్రధానంగా పటాన్చెరు, ఆర్సీపురం, అమీన్ పూర్ లలో ఏండ్లుగా లిటిగేషన్ భూముల పంచాయతీలు తెగకుండా ఉండిపోయాయి. కాగా అమీన్ పూర్ లో వివాదాస్పదంగా ఉన్న భూములకు ఇప్పుడు ఏవో పత్రాలు స్పష్టించి కాజేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కూడా ఒకరిద్దరు నాయకులు దగ్గరుండి పెద్దల పేరు చెప్పుకుని అధికారుల వద్ద కూర్చుని పనులు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందుకు సాగని ఫైళ్లు ఇప్పుడు ఎలా కదిలాయని బీఆర్ఎస్ నాయకుల్లో చర్చ మొదలైంది. అంతే కాకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం సమాచారం లేకుండా ఎవరో ఒకరిద్దరు నాయకులు ఏ విధంగా..? ఎవరి అండదండలతో ఆ దందాలు కొనసాగిస్తున్నారని రాజకీయంగా చర్చ కొనసాగుతోంది.
రెవెన్యూ నుంచి రిజిస్ట్రార్ కార్యాలయం వరకు...
లిటిగేషన్ భూముల క్లియరెన్స్ చేస్తున్న నాయకులు పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులు మొదలుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న పటాన్ చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పటాన్ చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారుల తనిఖీలు, అధికారుల సస్పెండ్ లు జరిగాయి. కొత్తగా ఇద్దరు అధికారులు సబ్ రిజిస్ట్రార్ పోస్టులు కూర్చోగా రెండు నెలల వ్యవధిలోనే తిరిగి వారిని ఉన్నతాధికారులు బదిలీ చేసిన విషయం తెలిసింది. పైరవీలు చేసుకుని పటాన్ చెరు స్థానాల్లోకి వచ్చారని గుర్తించిన ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపి ఇద్దరిని తొలగించగా ఇటీవలే మరో ఇద్దరు కొత్తగా విధుల్లో చేరారు. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పటాన్ చెరు సంబంధించిన లిటిగేషన్ ఫైళ్లు ఎలా క్లియర్ అవుతున్నాయనేది తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లకే డబులు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
ఏడాదిలోనే ఎందుకు విమర్శలు..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. అయినా పటాన్ చెరు నియోజకవర్గంలో మాత్రం భూ దందాలు, లిటిగేషన్ల ఫైళ్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ వ్యవహారాలు పెరగడం చర్చకు దారితీస్తున్నది. అధికార యంత్రాంగం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నదని, అందుకు ఆ పార్టీ నాయకుల అండదండలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకులను కంట్రోల్ చేయలేకపోవడం, అధికార వ్యవస్థ ను అదుపులో పెట్టడంలో ప్రభుత్వ పెద్దలు విఫలం అయ్యారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎవరు పడితే వారు అక్రమ భూదందాలు చేస్తామని పటాన్ చెరులో వాలిపోవడం చూస్తుంటే అసలు అధికార యంత్రాంగం ఉందా..? లేదా..? అనే అభిప్రాయం వస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు చెప్పుకురావడం గమనార్హం. తమకు తెలియకుండానే ఎవరో వచ్చి ఇక్కడ దందాలు చేస్తున్నారని ఆ నాయకుడు మండిపడ్డారు. మున్ముందు ఏం జరగనుందో..? ఈ వ్యవహారాలను ఎవరైనా కట్టడి చేస్తారా..? లేదా..? అనే అంశం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.