రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి

by Sridhar Babu |
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
X

దిశ, సంగారెడ్డి : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఖరీఫ్ 2024-25 సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంగారెడ్డి కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరారు. సన్నధాన్యం, దొడ్డు రకాలకు విడివిడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో సూపర్ ఫైన్ రకానికి క్వింటాలుకు రూ.2320, కామన్ వెరైటీకి రూ.2300 ధరను నిర్ధారించిందన్నారు. అదనంగా సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు సమయానికి అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరేవరకు అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి సన్న రకం ధాన్యం రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి : కలెక్టర్ క్రాంతి

కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోగా డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో రెవెన్యూ, పౌర సరఫరాల, వ్యవసాయ, పోలీసు, సహకార, రవాణా శాఖలు, ఐకేపీ సిబ్బంది సమన్వయం పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్ డీఏ పీడీ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, సివిల్ సప్లై డీఎం కొండలరావు, రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story