సమగ్ర సర్వేపై సందేహాలోద్దు : కలెక్టర్‌

by Kalyani |   ( Updated:2024-11-10 14:00:26.0  )
సమగ్ర సర్వేపై సందేహాలోద్దు :  కలెక్టర్‌
X

దిశ, ఆందోల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ కులగణన సర్వేపై సందేహాలు, అపోహలు అవసరం లేదని, ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతి సూచించారు. ఆదివారం పుల్కల్‌ మండలం గొంగ్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్‌ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని గమనించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన కోసం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలతో పాటు, సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట, బొల్లారం, తెల్లాపూర్, అమీనాపూర్‌ మున్సిపాలిటీ లలో సజావుగా సాగుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4.10 లక్షల నివాస గృహాలుండగా, 3400 ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ లుగా విభజించామని, 150 ఇళ్లకు ఎన్యుమరేటర్‌ ను, 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్‌ చొప్పున నియమించినట్లు ఆమె తెలిపారు. సర్వే నిర్వహించాల్సిన తీరుపై శిక్షణా తరగతుల ద్వారా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఇదివరకే క్షుణ్ణంగా అవగాహన కల్పించామన్నారు. సమగ్ర సర్వేను నియోజవర్గ ప్రత్యేక అధికారులు మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.

ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇదివరకు నిర్వహించిన ఇంటింటి పరిశీలన సందర్భంగా గుర్తించిన కొత్త ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో చేర్చబడ్డాయా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలని బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు సూచించారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మతి చెందిన ఓటర్ల వివరాలు ఓటరు జాబితా నుండి తొలగింపు జరిగిందా లేదా అన్నది చూసుకోవాలన్నారు.

కొనుగోలు కేంద్రం పరిశీలన

పుల్కల్‌ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతు వారీగా ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపుల వివరాలతో కూడిన రిజిస్టర్‌ ను, రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసిన వివరాలతో కూడిన ట్రక్‌ షీట్లను తనిఖీ చేశారు. వెంటనే ఓపీఎంఎస్‌ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని, సన్న, దొడ్డుధాన్యంల వివరాలను ఆన్‌ లైన్‌ లో జాగ్రత్తగా నమోదు చేయాలని ఆమె సూచించారు. పంటల వివరాల నమోదును అధికారులు సరిగ్గా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె స్పందించి రైతుల వివరాల నమోదులో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులను ఆమె హెచ్చరించారు. ఆమె వెంట ఆర్‌డీవో పాండు, తహశీల్దార్‌ కిరణ్‌తో పాటు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed